telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్యాబ్‌ లలో .. ప్రధమ చికిత్స పెట్టె ఉండాలి సరే.. కండోమ్ కూడానా..!

is condom compulsory in first aid boxes of cabs

దేశ రాజధానిలోని క్యాబ్‌ లలో ప్రథమ చికిత్స పెట్టెలో కండోమ్‌లు తప్పనిసరిగా ఉంచాలని బలంగా నమ్ముతున్నారు. అవి లేనివారికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తారన్న అపోహలో చాలామంది ఉన్నారు. ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని క్యాబ్‌లను ఆపి పరీక్షించగా ఈ విషయం బయటపడింది. దీనిపై ఓ జాతీయ వార్తా సంస్థ కొందరు క్యాబ్‌ డ్రైవర్లను ప్రశ్నించగా.. ప్రథమ చికిత్స పెట్టెల్లో కండోమ్‌లు లేకపోతే పోలీసులు తమకు జరిమానాలు విధిస్తున్నారని సమాధానం చెప్పారు. ఈ విషయాన్ని వేరొకరు చెప్పడం వల్ల తాను కూడా క్యాబ్‌లోని ప్రథమ చికిత్స పెట్టెలో కండోమ్‌లను ఉంచినట్లు రమేశ్‌ అనే డ్రైవర్‌ తెలిపారు. నిజానికి దిల్లీ మోటారు వాహనాల చట్టం చెబుతున్న నిబంధనల ప్రకారం ప్రజా రవాణా కోసం ఉపయోగించే ప్రతి వాహనంలో ప్రథమ చికిత్స పెట్టె ఉంచాలి. అందులో నిర్దేశిత మందులు, గాయానికి కట్టు కట్టేందుకు ఉపయోగించే డ్రెస్సింగ్‌ క్లాత్‌, దూది, టించర్‌ వంటివి ఉంచాలి. కండోమ్‌లు ఉంచాలని నిబంధనల్లో లేదు. ఈ విషయాన్ని దిల్లీ పోలీస్‌ ప్రత్యేక కమిషనర్‌ తాజ్‌ హాసన్‌ కూడా ధ్రువీకరించారు. దీనిపై తాము ఎలాంటి చలాన్లు విధించడం లేదని స్పష్టం చేశారు.

తన క్యాబ్‌లోని ప్రథమ చికిత్స పెట్టెను పరీక్షించి, అందులో కండోమ్‌ లేనందుకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారని ధర్మేంద్ర అనే క్యాబ్‌ డ్రైవర్‌ తెలిపాడు. కానీ ఆ చలాన్‌ను పరీక్షించగా అధిక వేగం నెపంతో పోలీసులు జరిమానా విధించినట్లు ఉందని ఆ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఇలాంటి అపోహలతో చాలా మంది కండోమ్‌లను ప్రథమ చికిత్స పెట్టెల్లో ఉంచుకుంటున్నారని తెలిపింది. చివరికి డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కూడా ఇదే చెబుతుండడం విశేషం. అన్ని ప్రజా వాహనాల్లోని ప్రథమ చికిత్స పెట్టెల్లో కనీసం మూడు కండోమ్‌లు ఖచ్చితంగా ఉంచాలని దిల్లీ సర్వోదయ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కమల్‌జీత్‌ గిల్‌ అన్నారు. అత్యవసర సమయాల్లో కండోమ్‌లను మరో విధంగానూ ఉపయోగించుకోవచ్చని కమల్‌జీత్‌ చెప్పారు. కారులో ఏదైనా గ్యాస్‌ పైప్‌ వంటిది పగిలిన సందర్భంలో దీన్ని పైపునకు చుట్టి కొంత సమయం వరకూ లీక్‌ కాకుండా చేయొచ్చని తెలిపారు. అంతేకాక దెబ్బలు తగిలినప్పుడు రక్తం కారకుండా కూడా వాడొచ్చని అన్నారు. వాన పడినప్పుడు తన బూట్లు తడవకుండా కూడా కండోమ్‌లను వాడుతున్నట్లు మరొక క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పడం విశేషం.

Related posts