telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంటర్నేషనల్ మీడియాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై స్పెషల్ బులెటిన్

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. కాగా మన బాలు ఘనత విశ్వవ్యాప్తమైందనడానికి నిన్న ఆయన మరణవార్తను ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ న్యూస్ చానల్లో ప్రసారం చేయడమే నిదర్శనం. సాధారణంగా అంతర్జాతీయ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇచ్చే బీబీసీ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక న్యూస్ బులెటిన్ ప్రసారం చేసింది. సీనియర్ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని, ఆయను అందరూ ఎస్పీబీ అని పిలుచుకుంటారని బీబీసీ యాంకర్ వార్తలు చదివారు. 74 ఏళ్ల వయసున్న బాలు దక్షిణ భారత సినీ రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులు అందుకున్నారని, ఆగస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు. తన 50 ఏళ్ల కెరీర్ లో 16 పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం బాలు మృతికి సంతాపం తెలిపారని వెల్లడించారు. అంతేకాదు, బాలు మృతిపై లైవ్ లో అభిప్రాయాలు కూడా అడిగారు. కాగా, ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్ర్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Related posts