telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఇన్ఫోసిస్ సీఈవోపై సంచలన ఆరోపణలు… ఒక్క రోజులోనే రూ.43,925 కోట్ల నష్టం

Infosys

ఇన్ఫోసిస్ కంపెనీపై మరో దుమారం చెలరేగింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ కంపెనీ రాబడిని ఎక్కువ చేసి చూపించడానికి అనైతిక అకౌంటింగ్ విధానాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో కంపెనీ షేర్లు 6 ఏళ్ల కనిష్టానికి కుప్పకూలాయి. ఒకే రోజు స్టాక్ ధర ఏకంగా ఇంట్రాడేలో 16 శాతం మేర పతనమైంది. ‘సలీల్ పరేఖ్ అనైతిక విధానాలు అనుసరిస్తున్నారు. ఇటీవల త్రైమాసికాల్లో కంపెనీ రాబడి, ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించడానికి అనైతిక అకౌంటింగ్ విధానాలు అవలంభిస్తున్నారు’ అని గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలకు బలాన్ని చేకూరేలా ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు కూడా పంపారు. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందించింది. ఆడిట్ కమిటీ ఈ అంశంపై దర్యాప్తు చేస్తుందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని తాజాగా స్టాక్ మార్కెట్‌కు తెలిపారు. దర్యాప్తు విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు. కంపెనీ బోర్డు అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను అనుసరిస్తోందని తెలిపారు. వాటాదారుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ ఆసియాలోనే రెండో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలోనే టీసీఎస్ తర్వాత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉంది. ఇకపోతే ఉదయం 11 గంటల సమయంలో ఇన్ఫోసిస్ షేరు ధర 15 శాతం క్షీణతతో రూ.659 వద్ద కదలాడుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.43,925 కోట్లు హరించుకుపోయింది.

Related posts