telugu navyamedia
culture hasyam

అప్రియాతి అప్రియమైన, అపూజ్యనీయులైన చైనా బావగారికి, మీ వియ్యంకుడు ఛీత్కరించుకుంటూ… వ్రాయునది.

అప్రియాతి అప్రియమైన, అపూజ్యనీయులైన చైనా బావగారికి,

మీ వియ్యంకుడు ఛీత్కరించుకుంటూ… వ్రాయునది.

కుశలమూ, కాకరకాయా ఏమీ లేవు.
మీ దరిద్రాన్ని మాకంటగట్టాక మీరు క్షేమంగానే ఉండి ఉంటారు. మా బతుకే మీ వూహాన్ మార్కెట్లా ఛండాలంగా తయారయ్యింది.

ఏనాడైతే మీ అమ్మాయి “కరోనా కుమారి” మా ఇంట్లో కుడి కాలెట్టి ప్రవేశించిందో కానీ, ఇల్లంతా అల్లకల్లోలం చేసేసి, అన్నిటికీ తాళాలేసి పడేసింది మహాతల్లి.
సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ సమసమాజం సందుల్లో సరదాగా తిరిగే మమ్మల్ని “సామాజిక దూరం, సింగినాదం” అని మూకుమ్మడిగా మూటగట్టి ఇంట్లో కూర్చోబెట్టింది మీ ముద్దుల కూతురు!

మూడు నెలలుగా ఇంట్లోనే ఉండీ, తోచీ తోచక మొగుడూ పెళ్ళాలు తిట్టుకునీ, కొట్టుకునీ, థప్పడ్లూ…., తాటాకులూ… అంటున్నారు.
స్కూళ్ళు లేక ఇంట్లోనే ఉంటున్న పిల్లకాయలు అల్లర్లూ, ఆన్లైన్ క్లాసులతో మా బుర్రల్ని మీరు బొద్దింకల్ని తిన్నట్టు తినేస్తున్నారు.

ఈ ఘోరాలన్నింటికీ కారణమైన మీ అమ్మాయి మీద ఒళ్ళు మండి, లాగి పెట్టి ఒక్కటి కొట్టాలని ఉన్నప్పటికీ, ఆ ముళ్ళసుందరిని మేము తాకినా, ఆమె మమ్మల్ని తాకినా క్వారంటైన్ అయ్యేది మా బ్రతుకేనని గ్రహించి ఆ ప్రయత్నం విరమించుకున్నాము. అసలు ఆమెని తాకడమనే వెర్రి ఆలోచనకే భయంతో వణుకుతూ చేతులు శానిటైజర్లతో రుద్దీ రుద్దీ, పాలకోవా మందంలో ఉండే మా చేతులు, పూతరేకుల మందానికి అరిగిపోయాయి.

ఈ తాకడాలు, తలనొప్పులూ ఎందుకులే గాని, పోనీ దూరంనుండైనా నోరారా తిట్టి మా నోటిపూత తీర్చుకుందామంటే, మా మూతులకి మాస్కులు తగిలించేసింది ముష్టి మొహంది.
ఏ మాటకామాట, అసలు మీ అమ్మాయి అందమే అందం! నట్టింట్లో నెత్తి మీద కిరీటం పెట్టుకు తిరుగుతుంది…. వెధవ చీకేసిన తాట్టెంక మొహమూ అదీనూ..!

ఆవిడ గారు అడుగెట్టాక,
ఓ పండుగా లేదు, పబ్బమూ లేదు.
ఓ మాటా లేదు, మంచీ లేదు.
ఓ సినిమా లేదు, షాపింగ్ లేదు.
ఐసోలేషన్లూ, క్వారంటైన్లూ తప్ప…!

వెళ్లక వెళ్లక బయటకెళ్లినా, ఈ వేసవిలో ఆ PPE కిట్లు, మాస్కులూ వేసుకుంటుంటే కావేసిన మామిడి పళ్ళల్లా మగ్గి చస్తున్నాం, మా ముక్కూ మొహం మండా!
పొరపాటున బయట చీదినా, తుమ్మినా పక్కనోళ్లు చూసే అనుమానపు చూపుల ఆపరేషన్లని తట్టుకునే కంటే, కూసింత కోపరేషన్తో ఇంట్లో కూర్చోవడం మంచిదని భావించి గుట్టుగా బతుకుతున్నాం, వెధవ సంతాని… వెధవ సంత!

అంతకీ నయానో, భయానో బెదిరిద్దామని పళ్ళాలూ గట్రా కొట్టి, దీపాలవీ పెట్టి చూసాము కూడా… అబ్బే, మొండి ఘటం కదూ… లొంగి చావలేదు!
పోనీ మొన్నేదో యుగాంతం అన్నారు కదా, పనిలో పనిగా మీ కరోనా కుమారి కూడా అంతమైపోద్దేమోనని అతిగా ఆశపడ్డాము మరియు ఆవేశపడ్డాము కూడా, అబ్బే ఆ ముచ్చటా తీరలేదు… మాకంత అదృష్టం ఎక్కడిదీ…?

చివరికి ఏవో మాకు తోచిన “ఆత్మనిర్భరాలవీ” ప్రకటించుకుని కాస్త ధైర్యం చెప్పుకుందామనుకున్నాం గానీ, ఇక నిబ్బరంగా ఉండడం మా వల్ల కాదు బాబూ…!!!

అయినా మొదటి నుండీ మీతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు. అయినప్పటికీ పిల్ల మేనమామ అయినటువంటి ఆ WHO గారు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మి, నిండా మునిగి, ఇప్పుడు భయంతో వణికి చస్తున్నాం.
ఇక అసలు చెప్పదలచుకున్నదేమనగా, మరి మీ గారాల కూతురు తన పుట్టింటిని, మరీ ముఖ్యంగా తన తల్లిగారైన గబ్బిలాన్ని గుర్తు తెచ్చుకుని గంపెడు గుబులు పడుతుంది….. బెంగతో దిగులు చెందుతుంది.
ఎలాగూ ఆషాడం కూడా వచ్చింది కనుక శాస్త్రం ప్రకారం మీ కరోనా కుమారిని పుట్టింటికి తీసుకెళ్లి, అమ్మాయి బెంగ తీర్చవలసిందని వేడుకుంటున్నాము.
ఆషాడం తర్వాత మీ పుత్రిక మళ్ళీ మా గడప తొక్కకుండా, ఆలోగా మేము కూడా మీలాగా ఒక గోడ కట్టుకుని, మా పాట్లేవో మేము పడతాము.
ఇంతే సంగతులు!!

ఇట్లు ,
మీ “కరోనా కుమారి” బాధిత వియ్యలవారు ..!

Related posts

ప్రముఖ షూస్ స్టోర్ స్క్రీన్‌ పై పోర్న్ వీడియోలు…!?

vimala p

శృంగార కోరికలు తగ్గుతున్నాయా ?

vimala p

విమానాన్ని నడుపుతూ 40 నిముషాలు నిద్రపోయిన పైలెట్… తరువాత…!?

vimala p