telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మహిళా క్రికెటర్‌ దీప్తిశర్మ సంచలనం .. టీ20ల్లో మూడు ఓవర్లకు జీరో రన్స్ ..

indian women cricketer deepti sharma new record

భారత మహిళా క్రికెటర్‌ దీప్తిశర్మ సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో మూడు ఓవర్లు మెడియిన్‌ చేసిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. పురుషుల క్రికెట్లోనూ ఈ ఘనతను ఎవరూ సాధించకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆమె ఈ అద్భుతం చేసింది. మ్యాచ్‌లో 4 ఓవర్లు విసిరి 3 ఓవర్లు మెయిడిన్‌ చేసి 8 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమె బౌలింగ్‌ ఎకానమీ కేవలం 2గా నమోదైంది. దీప్తి దెబ్బకు సఫారీ జట్టు చిగురుటాకులా వణికింది. మరో విశేషం ఏంటంటే ఆమె వేసిన తొలి 18 బంతుల్లో పరుగు తీసేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌వుమెన్‌కు ఏం చేయాలో అర్థంకాలేదు. అందులో రెండు వికెట్‌ మెయిడిన్లు ఉన్నాయి. ఎట్టకేలకు 19వ బంతికి సఫారీలు పరుగు సాధించారు. తన ప్రదర్శనతో దీప్తి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 130/8 పరుగులే చేసింది. హర్మన్‌ప్రీత్‌ (43), స్మృతి మంధాన (21) టాప్‌ స్కోరర్లు. సులభ లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలను టీమిండియా బౌలర్లు సమష్టిగా దెబ్బకొట్టారు. కట్టుదిట్టంగా బంతులు విసిరారు. 119 పరుగులకే పరిమితం చేశారు. డు ప్రీజ్‌ (59) మినహా మరెవ్వరూ రాణించలేదు. దీప్తిశర్మ 3 వికెట్లు తీసింది. శిఖ పాండే, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హర్మన్‌కు ఓ వికెట్‌ దక్కింది.

Related posts