telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డే-నైట్‌ టెస్టు : …మొదటి రోజే ఆధిక్యంలో .. భారత్..

india on leading in day and night test

ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న డే-నైట్‌ టెస్టు తొలి రోజు భారత్‌ ఆధిపత్యం కొనసాగుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టి బంగ్లాపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్.. ఇషాంత్‌ శర్మ (5/22) ధాటికి విలవిలలాడింది. 30.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత సారథి విరాట్‌ కోహ్లీ (56*), నయావాల్‌ పుజారా (55) అర్ధశతకాలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 174/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం బంగ్లా కంటే కోహ్లీసేన 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌ ద్విశతక హీరో మయాంక్‌ అగర్వాల్‌ (14) ఆదిలోనే వెనుదిరిగాడు. అల్‌అమిన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మెహదీ హసన్‌ చేతికి చిక్కాడు. దీంతో 26 పరుగులకే భారత్ తొలి వికెట్‌ కోల్పోయింది.

అనంతరం పుజారాతో కలిసి రోహిత్‌ (21) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ, ఇబాదత్‌ హుస్సేన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై రోహిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 43 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి కోహ్లీ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ అర్ధశతకాలు పూర్తిచేసుకున్నారు. ఇబాదత్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి పుజారా షెద్మాన్‌ చేతికి చిక్కడంతో 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రహానె (23*) వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేయడంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా 174 పరుగులు చేసింది. ఇదాబత్‌ రెండు వికెట్లు, అల్అమిన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను ఆదిలోనే ఇషాంత్‌ (5/22) దెబ్బతీశాడు. ఇమ్రుల్‌ కేయస్‌ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బంగ్లా సారథి మోమినుల్‌ హక్, మహ్మద్‌ మిథున్‌ ఖాతా తెరవకముందే ఉమేశ్‌ యాదవ్‌ (3/29) పెవిలియన్‌కు పంపించాడు. బంగ్లా కీలక బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌, హహ్మదుల్లా (6) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో బంగ్లా 38 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. తర్వాత లిటన్‌ దాస్‌ (24), నయీమ్‌ హసన్‌ (19) కాసేపు క్రీజులో నిల్చోవడంతో బంగ్లా 106 పరుగుల చేయగలిగింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (3/29), షమి (2/36) సత్తా చాటారు. చారిత్రక డే/నైట్‌ టెస్టులో బంగ్లా ఆటగాళ్లు ఇద్దరు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్లుగా బరిలోకి దిగారు. లిటన్‌ దాస్‌ స్థానంలో మెహదీ హసన్, నయీమ్‌ స్థానంలో తైజుల్‌ ఇస్లామ్‌ జట్టులోకి వచ్చారు. లంచ్‌ విరామానికి ముందుగా షమి బౌలింగ్‌లో లిటన్ తలకు గాయమైంది. దీంతో అతడు రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. విరామం తర్వాత అతడి స్థానంలో నయీమ్‌తో కలిసి మెహదీ హసన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. కొద్దిసేపటికే షమి వేసిన బౌన్సర్‌కు నయీమ్‌ కూడా గాయపడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసిన అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరిన అతడు తిరిగి మైదానంలోకి రాలేదు.

Related posts