telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఇళయరాజా ఎమోషనల్ పోస్ట్

SPB

కరోనా మహమ్మారి బారిన పడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలు గత కొన్ని రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆగస్టు 5న బాలు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. కాస్త జలుబు, జ్వరం మినహా తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, గురువారం రాత్రి ఎస్పీబీ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హాస్పిటల్ బులిటెన్ విడుదల చేయడంతో అంతా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా కూడా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకొని ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటూ ఇళయరాజా ఒక ఎమోషనల్ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘బాలు.. త్వరగా వచ్చేయ్. నీ జీవితం సినిమాతో ప్రారంభం కాలేదు. అది సినిమాతోనే ముగిసిపోకూడదు. సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ముందే మనం కచేరీలు చేశాం. సంగీతం మనిద్దరినీ కలిపింది. సంగీతం, స్వరాలు మాదిరిగా మనది విడదీయరాని బంధం. మనమెప్పటికీ స్నేహితులమే. ఈ స్నేహం మనల్ని ఎప్పటికీ వేరు చేయదు. ఆఖరికి మనం పోట్లాడుకున్నా దానిలోనూ స్నేహం ఉంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావని నా మనసు చెబుతోంది. ఇది నిజం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాలు, త్వరగా వచ్చేయ్. నీ కోసం నేను వేచి చూస్తున్నాను’’ అని తమిళంలో అన్నారు ఇళయరాజా.

Related posts