telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలో ఐబీఎం!

ibm employees

ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో 10 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్వహిస్తున్న ఆఫీస్ స్పేస్ ను తగ్గించింది. పెద్ద నగరాల్లోని భవనాల లీజ్ అగ్రిమెంట్లలో దాదాపు సగం అగ్రిమెంట్లను రద్దు చేసుకోనున్నట్టు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు పెరిగిన వేళ, ఇదే మోడల్ లో భవిష్యత్తులోనూ ఉద్యోగులతో పని చేయించుకోవడం ద్వారా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్న ఆలోచనతో ఐబీఎం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రస్తుతం ఇండియాలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఐబీఎంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిలో అత్యధికులు తమతమ ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా మార్చి చివరి వారం నుంచి వేల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమై, ఆఫీసు పనులనూ చక్కబెడుతున్నారు. లీజ్ స్పేస్ అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడంపై ఐబీఎం అధికారికంగా స్పందించాల్సి వుంది. తమకు చెందిన చాలా లీజ్ ఒప్పందాలు ఇప్పుడు రెన్యువల్ సమయానికి వచ్చాయని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు.

Related posts