telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇబ్రహీంపట్నం లో .. హ్యుందాయ్‌ ప్లాంట్ ..

Hyundai plant in ibrahimpatnam

ఇబ్రహీంపట్నం అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరడంతో దాని ఖ్యాతి ప్రంపంచ స్థాయిలో మారుమోగుతోంది. రక్షణ రంగ సంస్థలైన అక్టోపస్, బీడీఎల్, ఎన్‌ఎస్‌జీ తదితర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఆదిబట్లలో టాటా ఏరోస్పేస్, టాటా లాకిడ్‌ మార్టిన్, బోయింగ్‌ విమానాల తయారీ కంపెనీ, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ తదితర సంస్థలు పట్నం నియోజకవర్గం చుట్టూ ఏర్పాటైన విషయం తెలిసిందే. వీటిరాకతో ఈ ప్రాంతంలో రియల్‌వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందం మాదిరిగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పడమర ప్రాంతం ఆదిబట్ల, బొంగ్లూర్, కొంగరకలాన్‌ ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు రాకతో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తూర్పు భాగంలో రక్షణ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు వ్యవసాయాధారిత గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం వైపు బహుళజాతి కంపెనీలు చూస్తున్నాయి. ఈక్రమంలో ఆదిబట్ల తరహాలో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. ఎల్మినేడు గ్రామంలో హ్యుందాయ్‌ కార్ల కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్‌ఐఐసీ ద్వారా భూములు సేకరించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

నాలుగు సంవత్సరాలుగా భూములు సేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. కార్ల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న హ్యుందాయ్‌ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లేనని తెలుస్తోంది. గతంలో ఏరోస్పేస్‌ ఏర్పాటు కోసం ఇక్కడ భూములు కేటాయించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. భవిష్యత్తు అవసరాల కోసం అదే స్థానంలో ఈ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆదిబట్లలో హెలీకాప్టర్‌ విభాగాలు, బోయింగ్‌ విమానాల తయారీ అవుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎల్మినేడులో కార్ల తయారీ కంపెనీ కొలువు దీరనున్న నేపథ్యంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. పరిశ్రమల శాఖ ఈ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. సూమారు 2 వేల మందితో పని చేసే ఈ కంపెనీలో సుమారు రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

Related posts