telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : హ్యాట్రిక్ సాధించిన .. హైదరాబాద్ జట్టు..

hyderabad won on chennai ipl 2019 match

బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. ధోని లేని చెన్నై జట్టుకి సన్‌రైజర్స్‌ బౌలర్లు సమర్థంగా అడ్డుకట్ట వేశారు. అనంతరం సన్‌రైజర్స్‌ మరో 19 బంతులు మిగిలివుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో చెన్నైకిది రెండో ఓటమి మాత్రమే. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (50; 25 బంతుల్లో 10×4), జానీ బెయిర్‌స్టో (61 నాటౌట్‌; 44 బంతుల్లో 3×4, 3×6) అర్ధ సెంచరీలతో చెలరేగిన వేళ.. సన్‌రైజర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది.

సన్‌రైజర్స్‌ స్లో పిచ్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా అన్న సందేహాలు కలిగినా, 133 పెద్ద స్కోరేమీ కాకపోయినా.. మొత్తానికి మరో విజయం సాధించారు. వార్నర్‌, బెయిర్‌స్టో మరోసారి బ్యాటింగ్‌ భారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించాలన్న పట్టుదలతో ఆడారు. ఇన్నింగ్స్‌ రెండో బంతిని బెయిర్‌స్టో బౌండరీకి తరలించగా.. మూడో ఓవర్లో వార్నర్‌ మొదలుపెట్టాడు. చాహర్‌ బౌలింగ్‌లో 2 బౌండరీలు, శార్దూల్‌ బౌలింగ్‌లో మరో 2 ఫోర్లు, తాహిర్‌కు వరుసగా 3 బౌండరీలతో స్వాగతం పలికాడు వార్నర్‌. 5 ఓవర్లకే స్కోరు 58 పరుగులకు చేరుకుంది. చాహర్‌ ఆరో ఓవర్లో వరుసగా 2 బౌండరీలతో అర్ధసెంచరీ (24 బంతుల్లో) పూర్తి చేసిన వార్నర్‌.. వెంటనే ఔటయ్యాడు. ఈ సీజన్‌లో వార్నర్‌కిది ఐదో అర్ధసెంచరీ కాగా.. ఐపీఎల్‌లో 45వది. వార్నర్‌, బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఆ తర్వాతి ఓవర్లో ఇమ్రాన్‌ తాహిర్‌కే క్యాచ్‌ ఇచ్చి విలియమ్సన్‌ (3) ఔటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 71/2. అక్కడ్నుంచి 3 ఓవర్ల వరకు ఇన్నింగ్స్‌ నిదానంగా సాగింది. 11వ ఓవర్లో బెయిర్‌స్టో జూలు విదిల్చాడు. కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో 2 భారీ సిక్సర్లతో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. కొద్దిసేపటికే విజయ్‌ శంకర్‌ (7) ఔటైనా సన్‌రైజర్స్‌కు ఇబ్బంది లేకపోయింది. 17వ ఓవర్లో బెయిర్‌స్టో సిక్సర్‌ బాది లాంఛనాన్ని ముగించాడు.

చెన్నై బ్యాటింగ్‌ తీరు పరిశీలిస్తే.. 4 ఓవర్లలో 15/0.. 9 ఓవర్లలో 78/0.. 20 ఓవర్లలో 132/5. నెమ్మదిగా మొదలుపెట్టి.. అనంతరం జోరందుకుని.. చివరికి నీరసించిపోయింది. ఆరంభంలో వాట్సన్‌ (31; 29 బంతుల్లో 4×4), డుప్లెసిస్‌ (45; 31 బంతుల్లో 3×4, 3×6) నిదానంగా ఆడారు. ఐదో ఓవర్‌ నుంచి డుప్లెసిస్‌ బ్యాటుకు పనిచెప్పాడు. ఖలీల్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌, ఒక బౌండరీ బాదిన డుప్లెసిస్‌.. నదీమ్‌ తర్వాతి ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో అలరించాడు. డుప్లెసిస్‌ గేరు మార్చడం.. వాట్సన్‌ సైతం సహకారం అందించడంతో చెన్నై 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 78 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. దీంతో భారీ స్కోరు ఖాయమనిపించింది. నదీమ్‌ వేసిన పదో ఓవర్లో డుప్లెసిస్‌ మరో సిక్సర్‌తో అలరించగా.. అదే ఓవర్లో వాట్సన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అక్కడ్నుంచే సన్‌రైజర్స్‌ రేసులోకొచ్చింది. తర్వాతి ఓవర్‌ తొలి బంతికే డుప్లెసిస్‌ను విజయ్‌ శంకర్‌ బోల్తా కొట్టించాడు. అదనపు బౌన్స్‌ అర్థం చేసుకోలేక కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు మరింత ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడం కష్టమైంది. రషీద్‌ఖాన్‌ వేసిన 14వ ఓవర్‌ ఇన్నింగ్స్‌లో మలుపు. కేవలం 2 పరుగులే ఇచ్చిన రషీద్‌… రైనా (13), కేదార్‌ జాదవ్‌ (1)లను ఎల్బీలుగా వెనక్కి పంపాడు. ఇక చెన్నై కోలుకోలేకపోయింది. 11వ ఓవర్లో క్రీజులో అడుగుపెట్టి చివరి వరకు క్రీజులో ఉన్న రాయుడు (25 నాటౌట్‌; 21 బంతుల్లో 2×4) స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. జడేజా (20 బంతుల్లో 10 నాటౌట్‌) పూర్తిగా తేలిపోయాడు. పిచ్‌ నెమ్మదించడంతో బంతి బ్యాటుపైకి రాలేదు. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు రాబట్టడం గగనమైంది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన చెన్నై తర్వాతి 10 ఓవర్లలో 52 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.

hyderabad won on chennai ipl 2019 matchనేటి మ్యాచ్ : ఢిల్లీ vs ముంబై రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Related posts