telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ప్లే అఫ్ కి .. చేరేసిన .. హైదరాబాద్ .. దారిచూపిన కలకత్తా..

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కి చేరింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా కన్నా మెరుగైన రన్‌రేట్‌ సాధించిన సన్‌రైజర్స్‌ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. కోల్‌కతా నిర్దేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఒక వికెట్‌ కోల్పోయి 23 బంతులు మిగులుండగానే ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(30; 23 బంతుల్లో 1×4, 3×6), రోహిత్‌శర్మ(55; 48 బంతుల్లో 8×4) తొలి వికెట్‌కు 46 జోడించాక డికాక్‌ ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(46; 27 బంతుల్లో 5×4,2×6), కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. కోల్‌కతా బౌలర్‌ ప్రసిద్ధ్‌ ఒక వికెట్‌ తీశాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(9) తక్కువ పరుగులకే ఔటైనా మరో ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(41; 29 బంతుల్లో 2×4, 4×6) ధాటిగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక గిల్‌ ఔటయ్యాడు. కాసేపటికే లిన్‌ కూడా ఔటవ్వడంతో తర్వాత వచ్చిన రాబిన్‌ ఉతప్ప(40; 47 బంతుల్లో 1×4,3×6) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్‌బోర్డుని ముందుకు తీసుకెళ్లాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో దినేశ్‌ కార్తీక్‌ (3), ఆండ్రీ రసెల్‌(0) విఫలమైనా నితీశ్‌ రానా(26) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్‌కతా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లసిత్‌ మలింగ మూడు వికెట్లు తీయగా బుమ్రా, హార్దిక్‌ పాండ్య చెరో రెండు వికెట్లు తీశారు.

Related posts