telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ పావురాళ్లను .. అడవులకు తరలింపు ..

hyderabad pigeons shifted to forest

జీహెచ్‌ఎంసీ రెట్టలు వేసి చారిత్రక కట్టడాల అందాలను దెబ్బతీస్తున్నాయని పావురాలను పట్టి అడవులకు తరలిస్తోంది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పావురాలు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలూ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మొజంజాహీ మార్కెట్‌ వద్ద ఉన్న దాదాపు 500 పావురాలను పట్టి అటవీశాఖకు అప్పగించారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో మొజంజాహీ మార్కెట్‌ మరమ్మతు పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. మార్కెట్‌పై భాగంలోని గుమ్మటం, గడియారం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇతరత్రా పనులూ 70 శాతం వరకు జరిగాయని చెబుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వస్తోన్న పావురాలు రెట్ట వేయడంతో గుమ్మటం అందవిహీనంగా మారుతోందని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెట్టను రోజూ తొలగించడం ఇబ్బందికరంగా మారుతుండడం… తొలగించని పక్షంలో సుందరీకరణ పనులు చేసినా ప్రయోజనం కనిపించక పోవడంతో పావురాలను పట్టాలని నిర్ణయించారు.

మొజంజాహి మార్కెట్‌లో బేకరీలు, ఐస్‌క్రీమ్‌ షాపులు, పండ్లు, మాంసం, ఇతరత్రా దుకాణాలు ఉన్నాయి. ఆయా షాపుల్లోకి వందలాది మంది కొనుగోలుదారులు వస్తారు. పావురాల వల్ల ప్రజలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదమూ ఉందని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం మొజంజాహీ మార్కెట్‌ వద్ద 500 పావురాలను (బ్లాక్‌రాక్‌ పీజియన్‌లు) పట్టి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పావురాలను అటవీశాఖ అధికారులు శ్రీశైలం అడవుల్లో వదిలారని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మొజంజాహీ వద్ద పావురాల ఫీడింగ్‌ (జొన్నలు)ను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన పార్కుల్లో కూడా పావురాలకు ఫీడింగ్‌ వేయడాన్ని గతంలోనే నిషేధించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా మార్కెట్లు, ఆహార పదార్థాలు విక్రయించే చోట పావురాలు లేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం డిప్యూటి డైరెక్టర్‌ విల్సన్‌ తెలిపారు.

Related posts