telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

హృదయ తోరణం.

adabatu poetry corner

నిన్నటి మధురమైన
జ్ఞాపకాల దొంతరలు
మనోఫలకంపై అలానే ఉన్నాయి..

రాధా మాధవీ లతల మాటున
నిన్ను తొంగి చూసిన రెప్పలు
ఇంకా విచ్చుకొనే ఉన్నాయి..

బిందెలో దాచి తెచ్చిన 
తాయిలం తీపిరుచులు
ఇంకా తాజాగానే ఉన్నాయి…

నిన్ను తలచిన ప్రతిసారీ
చెంపలన్నీ కెంపుల పూలు
పూస్తూనే ఉన్నాయి…

నీవు వెళుతున్న దారివెంబడి సాగిన నా చూపు
నిన్ను వీపు తట్టి త్రిప్పిన క్షణాలు
అలానే ఉన్నాయి ఇంకా…

వేకువజామున నీవు వచ్చే రైలు కోసం
వేచి వేచి ఎన్ని శీతల పవనాల
దుప్పట్లు కప్పుకున్నానో…

ఇంటిముందుకు నీవు 
ఎప్పుడు వస్తావో అని హృదయాన్ని
గుమ్మానికి తోరణంగా కట్టేశా….

నీ మోహన రూపం ప్రతి పున్నమిలో
చూస్తున్నా..మౌన భాష్యాల పరామర్శలు
నీ కన్నులకు మాత్రమే తెలిసిన కళలు…

నీకు తెలుసా !ఎన్ని 
నిద్దుర వీడిన నిసివేళలు
నీకై కన్నీరు  కార్చానో…

ఇకనైనా…మౌనం
వీడి ఇటు రావా
నేను ఎప్పటికీ నీ రాధనే..!!

అవధానం అమృత.

Related posts