telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వామ్మో ఇంత ఖరీదైన హోటళ్లా .. ఒక్క ఆమ్లెట్ 850 రూపాయలట..రెండు బాయిల్డ్ ఎగ్స్‌కు 1700..

hotels charging thousands for 2 eggs

ఇష్టానికి రేట్లు పెట్టి వినియోగదారులను దోచుకుంటున్న స్టార్ హోటళ్ల గురించి గతంలో .. రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఓ ప్రముఖ రచయితకు సదరు హోటల్‌లో ఎదురైన వింత అనుభవం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రెండు గుడ్లకు 1700 వసూలు చేసిన హోటల్ సిబ్బంది.. ఇక సింగిల్ ఆమ్లెట్‌కు ఎంత ఛార్జీ చేశారో చూస్తే కంగు తినాల్సిందే మరి. ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌ పుస్తక రచయిత కార్తీక్‌ దార్‌ ఇటీవల ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆయన చేతిలో పెట్టిన బిల్లు చూసి అవాక్కయ్యారు. రెండు బాయిల్డ్ ఎగ్స్‌కు 1700 రూపాయలు ఛార్జీ చేయడంతో విస్తుపోయారు.

సింగిల్ ఆమ్లెట్ కోసం 850 రూపాయలు వసూలు చేశారు. తిన్నదేమో తక్కువ.. బిల్లు చూస్తే మాత్రం తడిసిమోపెడైంది. ఆ క్రమంలో సదరు హోటల్ నిర్వాహకులకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. దానికోసం సోషల్ మీడియాను అస్త్రంగా మలచుకున్నారు. ముంబై హోటల్‌లో తనకు జరిగిన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కార్తీక్ దార్. రెండు అరటిపళ్లకు 442.50 చెల్లించిన బాధితుడు రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఆందోళన వ్యక్తం చేద్దామా భాయ్‌ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఆయన బిల్లును ఫోటో తీసి పోస్ట్ చేయగా బాగా వైరల్‌ అయింది. దాంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఆ రెండు గుడ్లను పెట్టిన కోడి బంగారం కూడా పెట్టిందా ? లేదంటే ఆ కోడి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా?’ అంటూ కామెంట్లు పెట్టారు కొందరు. అయితే ఈ వ్యవహారంపై సదరు హోటల్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.

Related posts