telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

11 గంటల ప్రయాణం… బయలుదేరిన చోటే ల్యాండైన విమానం…!

yoga in aeroplane by a passenger

నెదర్లాండ్స్‌కు చెందిన ఓ విమానం మెక్సికోకు బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి కెనడాపైగా వెళ్తోంది. ఆ సమయంలో విమానం నడుపుతున్న పైలట్‌కు కొన్ని హెచ్చరికలు అందాయి. మెక్సికోలో యాక్టివ్‌గా ఉన్న పోపోకాటెపెటిల్ అగ్నిపర్వతం బద్దలైందనేది ఆ హెచ్చరికల సారాంశం. దీంతో విమానాన్ని మెక్సికోలో దింపడం కుదరదని అతనికి విమానాశ్రయ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మాటలు విన్న పైలట్.. దగ్గరలోని ఏదో ఒక విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకొని అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయొచ్చు. కానీ ఆ విమాన కార్గోలో కొన్ని గుర్రాలున్నాయి. దీంతో వేరే విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతివ్వరు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా షాకయ్యారు. మెక్సికోలో దిగిన తర్వాత ఏం చేయాలో వేసుకున్న ప్లాన్లన్నీ చెడిపోవడంతో చాలా బాధపడ్డారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒకే మార్గం ఉందని అర్థం చేసుకున్న పైలట్.. విమానాన్ని వెనక్కు తిప్పి ఐదున్నర గంటలు ప్రయాణించి తిరిగి ఆమ్‌స్టర్‌డ్యాం చేరుకున్నాడు. అంతసేపు ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే రావడంతో ప్రయాణికులంతా విసుక్కున్నారు. కానీ అగ్నిపర్వతం బద్దలైతే ఎవరూ ఏమీ చేయలేరని అర్థం చేసుకొని, అసంతృప్తితోనే ఇంటిబాట పట్టారు. ఈ ఘటనపై స్పందించిన కేఎల్‌ఎమ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి.. ‘మెక్సికోలో అగ్నిపర్వతం బద్దలవడంతో అక్కడ విమానం ల్యాండింగ్ అసంభవం. అలానే వేరే ఎక్కడైనా ల్యాండయితే ప్రయాణికులకు వీసా సమస్యలొస్తాయి. దానికితోడు కార్గోలో కొన్ని గుర్రాలున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే విమానాన్ని తిరిగొచ్చేయాలని ఆదేశించాం’ అని వివరించారు.

Related posts