telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

ప్రభాస్ ని ఇబ్బంది పెట్టారు.. : హైకోర్టు

prabhas

సినీనటుడు ప్రభాస్‌ భూమి క్రమబద్ధీకరణకు సంబంధించి (రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ పన్మక్త గ్రామంలో భూముల వివాదం) హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొనుగోలు చేసిన భూముల్లో సినీనటుడు ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని, దీనికి అధికారులు అనుసరించిన విధానం చట్ట నిబంధనలకు లోబడి లేదని పేర్కొంది. 1958 నుంచి పైగా భూములకు సంబంధించి వివాదం నడుస్తున్నందున ఆ భూములను తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్‌కు అప్పగించలేమని తేల్చి చెప్పింది. ప్రభాస్‌ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను తిరస్కరిస్తే తగిన ఆదేశాల నిమిత్తం తిరిగి ప్రభాస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. అదేవిధంగా ఆరు దశాబ్దాలకు పైగా వివాదంలో ఉన్న పైగా భూముల వ్యవహారంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయంతో పాటు వివాదాలకు తెరపడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రాయదుర్గ్‌ పన్మక్త గ్రామంలో తన భూమిని గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ గతంలో ప్రభాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, దీనిపై జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. విక్రయ దస్తావేజుల ద్వారా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తరాదన్న ఉద్దేశంతో ప్రభాస్‌ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని, దీని పరిష్కారంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో భూమిపై ప్రభాస్‌ హక్కుల జోలికి తాము వెళ్లడంలేదని, అలా స్పందిస్తే తమ పరిధిదాటినట్లేనంది. అయితే ఆక్రమణదారులకూ హక్కులున్నాయని, వారిని ఖాళీ చేయించడానికి భూఆక్రమణల నిరోధక చట్టం ఉందని తెలిపింది. అలా కాకుండా సివిల్‌ కోర్టును ఆశ్రయించి హక్కులు తేల్చుకోవాలంటూ ప్రభాస్‌కు చెప్పడం సరికాదని తప్పుపట్టింది. చట్ట వ్యతిరేకంగా అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నపుడు దాన్ని తిరిగి అప్పగించాలంటూ ఆదేశాలివ్వవచ్చని, ఈమేరకు సుప్రీం కోర్టు తీర్పులున్నాయంది. ప్రస్తుతం ఈ భూమి వ్యవహారంలో దశాబ్దాలుగా వివాదం ఉన్న నేపథ్యంలో భూమిని తిరిగి స్వాధీనం చేయాలన్న ఉత్తర్వులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ప్రజా, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవాలంది. ఈ తీర్పు కాపీ అందిన ఎనిమిది వారాల్లో ప్రభాస్‌ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేయాలంది.

Related posts