telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి .. హైకోర్టు చురకలు..

high court on new building in telangana

రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ జ్వరాల నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు చేపట్టడంలేదంటూ మండిపడింది. డెంగీ మరణాల నేపథ్యంలో డాక్టర్ కరుణ అనే వైద్యురాలు గతంలో ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై గత కొంతకాలంగా ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిల్‌పై మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో డెంగీ పరిస్థితి- ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అడ్వొకేట్‌ జనరల్‌ నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఎంతమందికి డెంగ్యూ జ్వరాలు వచ్చాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయాన్ని నివేదించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం సరిగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనబడటంలేదని పేర్కొంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, హోర్డింగ్‌లు ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ మరణాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని మండిపడింది. రాష్ట్రంలో ఇంత గందరగోళం నెలకొన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు గురువారం ఉదయం ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ కూడా వ్యక్తిగతంగా రేపు ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి? డెంగీని నియంత్రించేందుకు తమకు ఉన్న ఇబ్బంది ఏమిటో పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.

Related posts