telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉగ్రదాడులపై .. నిఘా వర్గాల హెచ్చరికలు .. పలుచోట్ల హై అలర్ట్‌…

high alert in many air force camps in india

జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వైమానిక స్థావరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8-10 మంది ఉగ్రవాదులు ముఖ్యంగా శ్రీనగర్‌, అవంతిపుర, జమ్ము, పఠాన్‌కోట్‌, హిందన్‌ వైమానిక స్థావరాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ముప్పును ముందే ఎదుర్కొనేందుకు సీనియర్‌ వైమానికదళ అధికారులు నిరంతరం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పంజాబ్‌ మీదుగా జమ్ము కశ్మీర్‌లోకి పాకిస్థాన్‌ ఆయుధాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

పాక్‌ ఐఎస్‌ఐ సహకారంతో ఖలిస్థాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌ (కేజడ్‌ఎఫ్‌) అనే సంస్థ డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంజాబ్‌లో జారవిడుస్తోంది. నిఘా వర్గాల అంచనా ప్రకారం సెప్టెంబరు 6 నుంచి 15 మధ్య ఎనిమిది సార్లు డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేతలు జరిగినట్లు తెలుస్తోంది. సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్ ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసిన 48 గంటల్లో ఆయా స్థావరాల్లో హై అలర్ట్‌లు జారీ చేశారు. దాదాపు 500 మంది ఉగ్రవాదులు బాలాకోట్‌లో చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Related posts