telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

షుగర్ ఉన్న వారికీ శుభవార్త….!

సెనగలు… పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ, ఇంట్లో జరిగే ఇతర ఫంక్షన్లకూ చాలామంది ఎక్కువగా వాడే అపరాలు (కాయధాన్యాలు). నల్ల సెనగల్ని నీళ్ళలో నానబెట్టి, ఆ నానబెట్టిన సెనగల్ని పిల్లలకూ, పెద్దలకూ పంచడం ఊళ్ళలో మనం తరచూ చూసే దృశ్యం. అందరికీ అందుబాటులో, చౌకగా దొరికే ఈ నల్ల సెనగలతో తాజాగా మరో ఆరోగ్య ప్రయోజనం కూడా వెలుగులోకి వచ్చింది. భోజనం చేయడాని కన్నా ముందు మొలకెత్తిన సెనగలు తింటే, మధుమేహ వ్యాధి వచ్చే రిస్కును తగ్గించుకోవచ్చని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
మనం సర్వసాధారణంగా వాడే మూడు రకాలైన అపరాల మీద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐ.ఐ.సి.టి)కి చెందిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపింది. సెనగలు,పెసలు, అలాగే సెనగ గింజలలో మరో రకమైన కాబూలీ చన్నాలను ఈ బృందం పరిశీలించింది. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసుకోవడాన్ని నియంత్రించడంలో ఆ మూడింటి సామర్థ్యాన్నీ ఒకదానితో మరొకటి పోల్చి చూసింది.
పిండిపదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్న తరువాత ఒంట్లోని షుగర్‌ స్థాయిలను తగ్గించడంలో సెనగలు సమర్థంగా పనిచేస్తున్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 50 గ్రాముల మొలకెత్తిన సెనగలను భోజనానికి ముందు తినడం వల్ల ఈ ఉపయోగం ఉందని వారు తేల్చారు. అలా సెనగల్ని భోజనానికి ముందు తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయికి అది పగ్గం వేస్తుంది. అలా కాకుండా మామూలుగా అయితే, భోజనం చేసిన వెంటనే మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్ల పుణ్యమా అని ఒంట్లో షుగర్‌ స్థాయి ఉన్నట్టుండి పెరిగిపోతుందని ఏ.కె. తివారీ అనే శాస్త్రవేత్త నేతృత్వంలోని ఈ బృందం నిర్ధారణ చేసింది.
మధుమేహ వ్యాధిగ్రస్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ యే రకాల మొలకెత్తిన ధాన్యాలు అత్యంత ఉపయోగకరమో తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం సాగించారు. ”సర్వసాధారణంగా ఈ మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అందరికీ తెలుసు. అయితే, ఒంట్లో చక్కెర స్థాయి పెరిగిపోకుండా చూసేందుకు సెనగలు ప్రత్యేకించి ఉపయోగపడతాయని ఇప్పుడు మా అధ్యయనంలో తేలింది. భోజనానికి ముందు మొలకెత్తిన సెనగలు తింటే, మధుమేహ వ్యాధిగ్రస్థులకు బాగా పనిచేస్తుంది. ఆ వ్యాధి రావడాన్ని జాప్యం చేయడానికీ, కొందరికైతే ఆ వ్యాధే రాకుండా నిరోధించడానికీ సెనగలు ఉపకరిస్తాయి” అని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
పచ్చి సెనగల్ని నీళ్ళలో నానబెట్టి, మొలకెత్తగానే వాటికి ఏమీ కలుపుకోకుండా అలాగే తినాలని వారు చెబుతున్నారు. వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటిని మన జీర్ణ వ్యవస్థ తొందరగా శోషించుకోలేదు. పైపెచ్చు, త్వరితగతిన జీర్ణక్రియ సాగడాన్ని నిరోధించే దీనిలోని అంశాలు కార్బోహైడ్రేట్లు వేగంగా ఒంట్లో శోషణ కాకుండా చూస్తున్నాయి. దాంతో, సెనగల లాంటివి మధుమేహంతో బాధపడుతున్నవారికీ, బాధపడే అవకాశమున్నవారికీ దివ్యౌషధమనే చెప్పాలి. 

Related posts