telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

గుడ్ న్యూస్… రైల్వే స్టేషన్లలో హెల్త్ ఏటీఎంలు… రూ.50 ఇస్తే 6 నిమిషాల్లో రిపోర్ట్

Health-ATM

ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిట్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు ట్రైన్ జర్నీ చేసే వారి కోసం రైల్వే స్టేషన్లలో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ లక్నో రైల్వే స్టేషన్‌లో రెండు హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. లక్నో రైల్వే స్టేషన్‌లోని హెల్త్ ఏటీఎం దాదాపు 16 హెల్త్ చెకప్‌ సర్వీసులు అందిస్తుంది. దీని కోసం రూ.50-రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రెండు రకాల హెల్త్ చెకప్‌లు ఉంటాయి. ఒకటేమో 9 నిమిషాల చెకప్. రెండోదేమో 6 నిమిషాల చెకప్. 9 నిమిషాల చెకప్‌కు రూ.100 చెల్లించాలి. అదే 6 నిమిషాల చెకప్‌కు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. హెల్త్ చెకప్ రిపోర్ట్‌ను వెంటనే పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌‌కు మెయిల్ వస్తుంది. యోలో హెల్త్ ఏటీఎం స్టేట్ హెడ్ అమ్రేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘రోజుకు 50-60 మంది హెల్త్ ఏటీఎం సదుపాయాలను పొందొచ్చు. జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు సులభంగానే తెలుసుకోవచ్చు. దీంతో జర్నీని కొనసాగించాలా? వద్దా? అని నిర్ణయించుకోవచ్చు’ అని వివరించారు. హెల్త్ ఏటీఎంలు ఇప్పుడు కేవలం లక్నో స్టేషన్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే ఇండియన్ రైల్వేస్ హెల్త్ ఏటీఎంలను రానున్న కాలంలో ఇతర స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, బాడీ ఫ్యాట్, హీమోగ్లోబిన్, మెటబాలిక్ ఏజ్, మజిల్ మాస్, వెయిట్, హైట్, టెంపరేచర్, బసల్ మెటబాలిక్ రేటింగ్, ఆక్సిజన్ శాచురేషన్, పల్స్ రేట్, బ్లడ్ గ్లూకోజ్, బోన్ మాస్ వంటివి హెల్త్ చెకప్‌లో భాగంగా ఉంటాయి. తక్కువ ధరకే ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం గమనార్హం.

Related posts