telugu navyamedia
క్రీడలు

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌‌లో నేను ఆడబోవట్లేదు… షాకిచ్చిన భజ్జీ

Harbhajan

సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఆగస్టు 20న అక్కడికి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో కలిసి వెళ్లాల్సిన భజ్జీ భారత్‌లోనే ఉండిపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సెప్టెంబరు 1 వరకూ చెన్నై ఫ్రాంఛైజీని గడవు అడిగిన హర్భజన్ సింగ్.. తాజాగా వ్యక్తిగత కారణాలతో తాను ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడబోవట్లేదని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారం క్రితం చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా హర్భజన్ సింగ్ కూడా తప్పుకోవడంతో అసలు చెన్నై జట్టులో ఏం జరుగుతోంది..? అనే చర్చ మొదలైంది. ఇటీవల చెన్నై జట్టులో 13 మంది కరోనా వైరస్ బారినపడగా.. గురువారం నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవడంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘డియర్ ఫ్రెండ్స్.. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌‌లో నేను ఆడబోవట్లేదు. ఇది చాలా క్లిష్ట సమయం. ఫ్యామిలీతో సమయం గడిపేందుకు.. నాకు కొంచెం ప్రైవసీ కావాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ నాకు మద్దతుగా నిలిచింది. ఐపీఎల్ గొప్పగా జరగాలని కోరుకుంటున్నా. సురక్షితంగా ఉండండి.. జై హింద్’’ అని భజ్జీ వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి పదేళ్లపాటు ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టోర్నీలో ఆడుతున్నాడు. రూ. 2 కోట్లకి వేలంలో భజ్జీని కొనుగోలు చేసిన చెన్నై.. గత రెండు సీజన్లలోనూ టీమ్‌లో రెగ్యులర్‌గా ఆడించింది. ముఖ్యంగా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నమ్మదగిన బౌలర్లలో ఒకడిగా భజ్జీ గుర్తింపు పొందాడు. కానీ.. తాజాగా ఐపీఎల్ 2020 నుంచి అతను వైదొలగడం చెన్నై టీమ్‌కి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

Related posts