telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

బొట్టు, మెట్టెలు పెట్టుకోని భార్య.. విడాకులు కోరిన భర్త: మంజూరు చేసిన హైకోర్టు

sindhur marriage

హిందూ సాంప్రదాయాన్ని పాటించని భార్య తనకు వద్దని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ముఖానికి బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోని భార్య వద్దని విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. కేసును విచారించిన గౌహతి హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఫ్యామిలీ కోర్టు, విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించగా, బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. హిందూ మహిళ, వివాహం తరువాత ముఖానికి సిందూరం, కాళ్లకు మెట్టలు ధరించడం సంప్రదాయమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమని కోర్ట్ స్పష్టం చేసింది.

భర్త మనోభావాలను గౌరవించాలని, ఆ పని చేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కుంకుమ, మెట్టలు ధరించేందుకు ఇష్టపడటం లేదంటే, తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోంది. ఆమె పెళ్లిని అంగీకరించినట్టుగా అనిపించడం లేదు. వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉందని హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

Related posts