telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఇవే !

సాధారణ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్‌. సాధారణ ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎంతమందికైనా ఓటువేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నంబరే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఓట్ల లెక్కింపునకే కనీసం రెండురోజులు పడుతుందంటే ఉత్కంఠ ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన లేకుండా ఓటుహక్కు వినియోగించుకుంటే ఒక్కోసారి అది చెల్లుబా టు కాకపోగా.. ఎంపికచేసుకున్న అభ్యర్థి విజయంపై కూడా ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈ నెల 14న పోలింగ్‌ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌పై ప్రత్యేక కథనం.

హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘హైదరాబాద్‌’ నుంచి 93 మంది, ‘వరంగల్‌’ నుంచి 71 మంది పోటీచేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్లతోపాటు, నోటా కూడా కలిపి ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ను వినియోగిస్తున్నారు. న్యూస్‌ పేపర్‌ పరిమాణంలో ఈ బ్యాలెట్‌ పేపర్‌ ఉండనున్నది. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉండటంతో ఓటింగ్‌పై ముందుగానే అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. లేకపోతే ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఓటింగ్‌ విధానమిది
బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటాయి. పేరుకు ఎదురుగా ఉండే బాక్సులో ఓటరు సదరు అభ్యర్థికి ఇచ్చే ప్రాధాన్యతా సంఖ్యను వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత సంఖ్యను అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాలి.
పోలింగ్‌ కేంద్రంలో అధికారి ఇచ్చే పర్పుల్‌ (ఊదా రంగు) కలర్‌ స్కెచ్‌ పెన్‌తో మాత్రమే అంకెలు వేయాలి.
మొదటి ప్రాధాన్యత ఓటును కచ్చితంగా వేయాలి. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యతాక్రమంలో సూచించవచ్చు.
ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను వేయకుండా.. తర్వాత సూచించే ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 1, 2, 3, 4, 6, 7, 8 ఇలా వస్తే.. మధ్యలో ‘5’ మిస్‌ అయినందున 4 వరకే పరిగణనలోకి తీసుకుంటారు.
ఒక అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువమందికి ’1’ అని ఇస్తే ఆ ఓటు చెల్లదు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా చెల్లదు.
అభ్యర్థి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్‌ మార్కుగానీ, ఇతర రాతలు, సంతకాలు, వేలుముద్ర కానీ వేస్తే చెల్లదు.
50శాతం +1 వచ్చేదాకా కౌంటింగ్‌
సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో యాభైశాతం కంటే ఎక్కువ వస్తేనే విజేతను ప్రకటిస్తారు. అంటే ఒక అభ్యర్థికి 50+1 వచ్చేదాకా 1,2,3 ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీతోపాటు, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుతోనే గెలిచినవారు లేరు. అదేవిధంగా 2వ ప్రాధాన్యత ఓటుదాటి లెక్కించలేదు.

కౌంటింగ్‌ ఇలా..
కౌంటింగ్‌ కేంద్రానికి చేరిన బాక్సుల్లోని బ్యాలెట్‌ పేపర్లన్నింటినీ ఓట్ల లెక్కింపు రోజున ఒక్కచోట కుమ్మరిస్తారు. బ్యాలెట్‌ పేపర్లను ఓపెన్‌ చేయకుండా 50 చొప్పున బండిల్స్‌ (కట్టలు) కడతారు. ఇలా కట్టిన బండిళ్లను ఒక డ్రమ్ముల్లో వేసి కలుపుతారు. తర్వాత వాటిని టేబుళ్ల వారీగా పంపిణీ చేస్తారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక్కో అభ్యర్థికి ఒక్కోగడిని కేటాయిస్తారు. కౌంటింగ్‌ అసిస్టెంట్లు బ్యాలెట్‌ పేపర్లను తెరిచి.. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను మాత్రమే పరిశీలిస్తారు. ‘1’ నంబర్‌ ఎవరి పేరు ముందు వేస్తే ఆ బ్యాలెట్‌ పేపర్‌ను సంబంధిత అభ్యర్థికి కేటాయించిన గడిలో వేస్తారు. ఈ క్రమంలోనే చెల్లని, అనుమానాస్పద (డౌట్‌ఫుల్‌) ఓట్లను కూడా గుర్తిస్తారు.

మొదటి రౌండ్‌తో కోటా నిర్ణయం
సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత అంకెల లెక్కింపు ప్రాతిపదికన రౌండ్లు ఉంటాయి. ఒకటో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మొదటి రౌండ్‌ పూర్తయినట్టు పరిగణిస్తారు. తొలి రౌండ్‌లో భాగంగా అన్ని బ్యాలెట్‌ పేపర్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికెన్ని వచ్చాయనేది తేలుస్తారు. ఈ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు పెట్టి.. మొత్తం చెల్లుబాటైన ఓట్లు తేలుస్తారు. ఆ ఓట్లలో 50 శాతం ప్లస్‌ ఒక ఓటు కలిపి.. కోటాగా నిర్ధారిస్తారు. మొదటి ప్రాధాన్యతలోనే ఒక అభ్యర్థికి కోటా మేరకు ఓట్లు వస్తే సదరు అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

కోటా చేరే వరకు ఎలిమినేషన్‌
మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత ఏ అభ్యర్థికీ కోటా మేరకు ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్‌ విధానాన్ని అమలుచేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థిని ముందుగా ఎలిమినేట్‌ చేస్తారు. ఎలిమినేట్‌ అయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండోప్రాధాన్యత ఓట్లను పరిశీలిస్తారు. వాటిల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను అంతకుముందు వారికివచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లకు కలుపుతారు. అయినప్పటికీ ఎవరికీ కోటా ఓట్లు రానట్లయితే.. జాబితాలో రెండో తక్కువ ఓట్లు దక్కిన అభ్యర్థిని ఎలిమినేట్‌ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లను పరిశీలించి.. అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా జాబితాలో దిగువనుంచి ఎగువకు (మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా) ఎలిమినేషన్‌ చే సుకుంటూ వెళ్తారు. ఒక అభ్యర్థికి కోటా ఓట్లు వచ్చేదాకా ప్రక్రియ నిర్వహిస్తారు.

ఇప్పటిదాకా రెండులోనే తేలిన ఫలితాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహా రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే కోటా ఓట్లు సాధించినవారు లేరు. అన్ని ఎన్నికల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే కోటా సాధించారు. మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు ప్రక్రియ వెళ్లలేదు.

‘నోటా’ తర్వాత ప్రాధాన్యత ఉండదు
ఈ ఎన్నికల్లో నోటా అవకాశాన్ని కూడా కల్పించారు. ఓటరు నోటా బాక్సులో ‘1’ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే బరిలో నిలిచిన ఏ అభ్యర్థికీ ఓటేయనట్టుగా ‘నోటా’ కోటాలోకి ఓటు వెళుతుంది. ఒకవేళ మధ్యలో ‘నోటా’కు ప్రాధాన్యత ఇస్తే తదుపరి ప్రాధాన్యతల్ని పరిగణనలోకి తీసుకోరు.

Related posts