telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కృతఘ్నత, కృతజ్ఞత మధ్య తేడా ఇదే…

EVV and Jandhyala

దర్శకుడు, నటుడు, రచయిత జంధ్యాల గారు చనిపోయి అప్పుడే 18 సంవత్సరాలు అవుతుంది.
జూన్ 19న జంధ్యాల వర్ధంతి. ఆయన శిష్యులు, మిత్రులు ఆయన స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు.
తెలుగు సినిమా రంగంలో జంధ్యాల తనదైన ముద్ర వేశాడు. రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశాడు.
జంధ్యాల సినిమా రంగంలోకి రాక ముందు నాటక రచయిత, దర్శకుడు. సినిమాల్లోకి వచ్చిన చాలా సంవత్సరాలు రచయితగానే వున్నాడు. ఆ తరువాత ఆయనలోని సృజనాత్మక దర్శకుడు “ముద్ద మందారం” సినిమాతో బయటికి వచ్చాడు. ఇది 1981 నాటి మాట. ఆ తరువాత ఆయన దర్శకత్వం మీదనే ఎక్కువ మక్కువ చూపించారు.
దర్శకుడుగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఎన్నో నవ్వుల పువ్వుల సినిమాలు, సందేశాత్మక సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. ఈ సందర్భంగా జంధ్యాలకు సంబందించిన ఓ సంఘటన వివరిస్తాను.
తెలుగు సినిమా రంగం మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చింది.
అప్పటికే జంధ్యాల మద్రాస్ లో తన అభిరుచి మేరకు చక్కటి ఓ ఇల్లు నిర్మించుకున్నాడు.
అయితే సినిమా రంగం అంతా హైదరాబాద్ వచ్చేయడంతో జంధ్యాల కూడా హైదరాబాద్ కు వచ్చేయాలని సంకల్పించుకున్నాడు.
ఇల్లు కట్టుకొని కొంతకాలమే అయ్యింది. అందుకే చాలా కాలం మద్రాస్ లోనే వున్నాడు. సినిమ రంగం అంతా హైద్రాబాద్లో ఉండటంతో తాను కూడా అక్కడికే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
జంధ్యాల భార్య అన్నపూర్ణ కూడా హైదరాబాద్ వెడదాం అన్నది. అప్పటికే జంధ్యాలకు దర్శకుడుగా సినిమాలు తగ్గిపోతూ వస్తున్నాయి. హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్ లో ఓ అపార్ట్మెంట్ ఉంటే దాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. ఎంతైనా స్వంత ఇల్లు ఉంటే ఆ సౌకర్యమే వేరు. భార్య అన్నపూర్ణకు కూడా ఈ ప్రతిపాదన నచ్చింది. నిర్మాణంలో వున్న ఆ అపార్ట్మెంట్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ కు ఓ ఐదు లక్షల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. తనకు రావలసిన డబ్బు సకాలంలో రాలేదు.
ఈలోగా బిల్డర్ వత్తిడి చేయ్యసాగాడు. అప్పుడు తన సినిమాతో స్టార్ డమ్ వచ్చిన ఓ హాస్య నటుడికి ఫోన్ చేసి అడిగాడు.
అతను “మీరు అడగడమే మహా ప్రసాదం గురువు గారు… తప్పకుండా ఏర్పాటు చేస్తాను ” అన్నాడు.
అతను ఫోన్ చేసి డబ్బు పంపిస్తాడని జంధ్యాల ఎదురు చూస్తున్నాడు. వారం రోజులు గడిచి పోయాయి.
ఆ హాస్య నటుడు సినిమాలతో బిజీగా వుండి మర్చిపోయాడేమోనని … ఫోన్ చేశాడు
“అయ్యో గురువు గారు … మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు… మా మేనేజర్ ని అడిగితే .. మొన్ననే ఓ ప్లాట్ కొంటె దానికి
ఇచ్చానని చెప్పాడు… సారీ గురువు గారు ” అని చావు కబురు చల్లగా చెప్పాడు.
ఈ హాస్య నటుడికి లైఫ్ ఇచ్చింది జంధ్యాల. అప్పుడు రోజుకు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
రోజుకు 75 వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు.
ఇక అప్పుడు జంధ్యాలకు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుంటే దర్శకుడు, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ గుర్తుకు వచ్చాడు.
ఈవీవీ ఒకప్పుడు తన శిష్యుడు… తన మార్క్ చిత్రాలను అద్భుతంగా రూపొందిస్తున్నాడు.
అడిగితే ఏమంటాడో… అడగకపోతే బిల్డర్ కు ఎలాగైనా డబ్బు ఇవ్వాలి.
సరే .. చూద్దాం .. అని ఈవీవీ కి ఫోన్ చేశాడు.
గురువు ఫోన్ చేస్తాడని ఈవీవీ ఊహించలేదు. చాలా సంతోష పడ్డాడు.
ఫోన్లోనే తన అవసరం గురించి జంధ్యాల చెప్పాడు.
“గురువు గారు మీరు అమ్మగారు రేపు ఉదయం మా ఇంటికి భోజనానికి రండి” అని ఆహ్వానించాడు.
ఈవీవీ డబ్బు ఇస్తాను లేదా ఇవ్వను అని చెప్పలేదు… భోజనానికి రమ్మని పిలిచాడు.
ఆలోచనలో పడ్డాడు.. భార్య అన్నపూర్ణకు ఈ విషయం చెప్పాడు.
ఆమె భోజనానికి వెడదాం అని చెప్పింది.
ఫిలిం నగర్లో వున్న ఈవీవీ ఇంటికి వెళ్లారు.
ఈవీవీ ఆయన భార్య సరసతి ఇద్దరు జంధ్యాల దంపతులను సాదరంగా ఆహ్వానించారు.
చక్కటి భోజనం పెట్టి గురువు జంధ్యాల దంపతులను ఎంతో గౌరవించారు.
జంధ్యాల డబ్బు అడుగుదాం అనుకుంటున్నాడు కానీ.. అడగలేకపొయ్యాడు.
“ఇక బయలుదేరుతాం” అని జంధ్యాల అన్నాడు.
అప్పుడు ఈవీవీ ఒక్క నిముషం గురువు గారు అని లోపలకు వెళ్ళాడు.
భార్య సరస్వతి తో బయటకు వచ్చాడు. సరస్వతి చేతిలో వెండి పళ్లెం, అందులో ఇద్దరికీ బట్టలు వున్నాయి.
సరస్వతి జంధ్యాల భార్యకు బొట్టుపెట్టి పెట్టింది. ఇద్దరు వెండి పెళ్ళాన్ని అందించారు.
అందులో బట్టల మధ్య ఐదు లక్షల రూపాయలు వున్నాయి.
ఈవీవీ దంపతులు ఇద్దరు జంధ్యాల దంపతులకు నమస్కరించి “గురువు గారు.. ఈ డబ్బు మళ్ళీ ఇస్తామంటే నామీద
ఒట్టే… శిష్యుడుగా మీ ఋణం ఇలా తీర్చుకునే అవకాశం వచ్చింది” అన్నాడు.
జంధ్యాల దంపతుల కళ్ళల్లో ఆనందభష్ఫాలు.
కృతఘ్నతకు, కృతజ్ఞతకు తేడా ఇదే …

-భగీరథ

Related posts