telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

అంగరంగ వైభవంగా.. గోల్కొండ జగదాంబికా మహాంకాళి ఆషాడబోనాలు …

15 cr funds to bonalu in telangana

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గోల్కొండ జగదాంబికా మహాంకాళి ఆషాడబోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వరకు బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నమని ఆయన ప్రకటించారు. వివిధశాఖల అధికారులు, దేవస్థాన సభ్యులతో కలిసి జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై గోల్కొండ కోటలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన, మంత్రి అధికారులకు సూచనలు జారీచేశారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన మన పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఆషాడ బోనాల జాతరను అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హిందు, ముస్లింలు సఖ్యతతో వ్యవహరించి గోల్కొండ బోనాల జాతరను జరుపుకోవడం అనవాయితీగా వస్తుందని, ఇదే స్ఫూర్తిగా ఈ ఏడాది సైతం కొనసాగించాలన్నారు. జూలై 4వ తేదీన లంగర్‌హౌజ్ నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందని, బోనాల సందర్భంగా ప్రతి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.

భక్తుల సౌకర్యార్థం రోడ్లు మరమ్మతులు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఫ్లడ్‌లైట్లు, బారీకేడింగ్, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్ల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆది, మంగళవారాల్లో అత్యదికంగా భక్తులు వస్తుంటారని, కనుక తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. త్రీడీ మ్యాపింగ్ స్క్రీన్ల ద్వారా వీక్షణ, బోనాల సందర్భంగా వంటలు చేసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైద్యశిబిరాలు, అంబులెన్స్, అధ్యాత్మిక భక్తి వాతావరణం ప్రతిభింబిచేలా కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.

పారిశుధ్య పనుల కోసం అదనపు సిబ్బందిని వినియోగించాలని, జనరేటర్లు, అదనపు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మెహియుద్దీన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమీషనర్ ముషారఫ్‌అలీ ఫారూకీ, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ, డీసీపీ బాబురావు, కార్పొరేటర్లు మిత్రకృష్ణ, బంగారు ప్రకాశ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts