telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీగా పడిపోయిన బంగారం,వెండి ధర

gold

బంగారం ధర పడిపోతూనే వస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా రూ.763 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.41,443కు పడిపోయింది. అంతర్జాతీయం ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర 2 శాతం పతనమైంది. అంటే రూ.1,000 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.43,179కు దిగొచ్చింది. కాగా గత సెషన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 పడిపోయింది. వెండి కూడా కేజీకి రూ.1600 తగ్గింది. దీంతో బంగారం ధర రెండు రోజుల్లో రూ.2,000కు పైగా తగ్గిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావిస్తారు. అయితే గ్లోబల్ మార్కెట్ల పతనం కారణంగా పసిడిపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం సంభవించొచ్చనే భయాలు ప్రారంభమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ వారంలో బాగా పడిపోయే అంచనాలున్నాయి. 2011 నుంచి వారంలో బంగారం ధర ఈస్థాయిలో తగ్గనుండటం ఇదే తొలిసారి కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కాగా బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవలనే ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ బంగారం ధర ఈ రోజు 1.3 శాతం క్షీణించింది. పసిడి ధర ఔన్స్‌కు 1555 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. గత సెషన్‌లో కూడా పసిడి ధర 3.6 శాతం దిగొచ్చింది. దీదంతో బంగారం ధర ఈ వారంలో దాదాపు 7 శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. సోమవారం బంగారం ధర 1700 డాలర్ల పైకి చేరిన విషయం తెలిసిందే.

Related posts