telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహి కెప్టెన్సీ పై గంభీర్ ఆగ్రహం…

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీసేన చిత్తుగా ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఓటములపై స్పందించిన ఈ బీజేపీ ఎంపీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. గంభీర్ మాట్లాడుతూ.. భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నాకే ఏం అర్థం కావడం లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ అడ్డుకోవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కానీ విరాట్ మాత్రం ప్రధాన బౌలర్లతో రెండు ఓవర్లను మాత్రమే వేయించాడు. మాములుగా వన్డేల్లో మూడు స్పెల్స్‌లో 4-3-3గా వేయిస్తారు. ఒక్క స్పెల్ గరిష్టంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ ఇస్తారు. కానీ విరాట్ వ్యూహం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆరంభంలో బుమ్రాతో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. ఇదేం కెప్టెన్సీనో ఏమో మరీ. ఆ కెప్టెన్సీ తీరును కూడా నేను విశ్లేషించలేకపోతున్నా. ఇదేం టీ20 క్రికెట్ కాదు. అలా ఎందుకు చేశాడో కూడా అర్థం కావడం లేదు. ఇది అత్యంత చెత్త కెప్టెన్సీ’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆరో బౌలింగ్ ఆప్షన్ సమస్యను ఎదుర్కొంటున్న టీమిండియా.. వాషింగ్టన్ సుంధర్, శివమ్ దూబేల సేవలను ఎలా వినియోగించుకుంటుందో కూడా గంభీర్ వివరించాడు. ‘భారత జట్టుకు ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లు కావాలి. తదుపరి మ్యాచ్‌లో వారికి అవకాశం ఇచ్చి ఏలా ఆడుతారో చూడాలి. కానీ అలాంటి ఆటగాళ్లు ప్రస్తుతం ఆసీస్‌లో లేకుంటే మాత్రం అది ముమ్మాటికి సెలెక్షన్ కమిటీ తప్పే. అవకాశాలివ్వకుండా ఆటగాళ్ల సత్తాను తెలుసుకోలేం. ఇలా ఆప్షన్స్ లేకుంటే మాత్రం కోహ్లీసేనకు ఘోర పరాభావం తప్పదు.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Related posts