telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇండియన్ పనోరమాకు ఎంపికైన తెలుగు సినిమా ‘గతం’

51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ యేడాది నవంబర్ 20 నుండి 28 వరకూ ఎప్పటిలానే గోవాలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా ఇది వాయిదా పడింది. దీనిని వచ్చే యేడాది జనవరి 16 ఉండి 21 వరకూ గోవాలో నిర్వహించబోతున్నారు. తాజాగా కేంద్ర సమాచార ప్రసారశాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించే 23 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించారు. అందులో తెలుగు సినిమా ‘గతం’ కూడా ఎంపిక కావడం విశేషం.
భార్గవ పోలుదాసు, రాకేశ్‌ గాలేభే, పూజిత కురపర్తి ప్రధాన పాత్రలు పోషించిన ‘గతం’ సినిమాను సృజన్ యర్రబోలు, హర్షవర్థన్ ప్రతాప్, భార్గవ పోలుదాసు సంయుక్తంగా నిర్మించారు. కిరణ్‌ కొండమడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం సమకూర్చాడు. నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ లో ‘గతం’ స్ట్రీమింగ్ అయ్యింది.
తెలుగు సినిమా ‘గతం’తో పాటు ఈసారి ఇండియన్ పనోరమాకు ‘బ్రిడ్జ్’ (అస్సామి), అవిజత్రిక్ (బెంగాలి), బ్రహ్మ జానె గోపోన్ కొమ్మెటి (బెంగాలి), ఏ డాగ్ అండ్ హిజ్ మ్యాన్ (ఛత్తీష్‌గర్హీ), అప్ అప్ అండ్ అప్ (ఇంగ్లీష్), ఆవర్తన్ (హిందీ), శాండి కి ఆంఖ్‌ (హిందీ), పింకి ఎల్లి (కన్నడ), సేఫ్ (మలయాళం), ట్రాన్స్ (మలయాళం), కెట్టియోలాయె ఎంతె మలఖా (మలయాళం), తహిర (మలయాళం), ఇగికోన (మణిపురి), జూన్ (మరాఠి), ప్రవాస్ (మరాఠీ), కార్జానిసంచి వారి (మరాఠి), కలిరా అతీత (ఒరియా), నమో (సంస్కృతం), తయన్ (తమిళ) చిత్రాలు ఎంపికయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ కేటగిరిలో తమిళ చిత్రం ‘అసురన్’, మలయాళ సినిమా ‘కప్పెల’, హిందీ మూవీ ‘చిచ్చోరే’ ఉన్నాయి. విశేషం ఏమంటే… ఈ కేటగిరిలోని ‘అసురన్’ తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘నారప్ప’ పేరుతో రీమేక్ అవుతోంది. అలానే ‘కప్పెల’ సినిమానూ సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోంది.

Related posts