telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇన్‌చార్జి వీసీ నియామకంపై మంత్రి గంటా అసంతృప్తి!

ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్‌చార్జి వీసీ నియామకంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా శ్రీకాకుళం అంబేడ్కర్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకు ముందు ఈ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ఇక్కడే వీసీగా కాలపరిమితి ముగించుకున్న ప్రొఫెసర్‌ ఏ.రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ ఈ నెల 11న ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇన్‌చార్జి వీసీగా వర్సిటీ రెక్టార్‌ను నియమించాలని మంత్రి ప్రతిపాదనలను పక్కన పెట్టి, ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులు రాజేంద్రప్రసాద్‌ను నియమించడంతో చివరకు అది వివాదంగా మారింది.

ఈ విషయంలో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తపరచడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు రాజేంద్రప్రసాద్‌ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుచేసిన ఉన్నత విద్యాశాఖ.. చివరకు ఆయన నియామక ఉత్తర్వులు రద్దుచేసి కొత్తగా రామ్‌జీని నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీగా శ్రీకాకుళం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కూన రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దమయంతి జీవో నంబర్‌ ఆర్‌టీ 14ను ఆదివారం విడుదల చేశారు.

Related posts