telugu navyamedia
విద్యా వార్తలు

నేటి  నుంచి ఏపీ ఎంసెట్ ..  గోరింటాకు ఉంటే నో ఎంట్రీ!

నేటి నుంచి ప్రారంభమయ్యే అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఎంసెట్‌-2019)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌మ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు. మోహందీ ఉన్నా అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఈనెల 23న ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌కు సంబంధించి ప్రాధ‌మిక కీ విడుద‌ల చేస్తామ‌ని నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. ఆన్‌లైన్‌లో శనివారం నుంచి 23 వరకు (7 సెషన్లు) ఇంజనీరింగ్‌ విభాగం, 23-24 తేదీల్లో (3 సెషన్లు) అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగపు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సా.2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌లో 30వేల మందికి అవకాశం కల్పించారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ఆబ్జెక్టివ్‌ టైపులో ఉంటాయి. ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరుకానున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌లో 86,910 మంది ఉన్నారు. ఏపీ ఎంసెట్‌కు ఏపీలో 109 సెంటర్లు, హైదరాబాద్‌లో 6 మొత్తం 115 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు  తెలిపారు.
ప‌రీక్ష‌కు ముందు బ‌యోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర‌ను..ఫొటోను స్వీక‌రిస్తున్నారు. విద్యార్దులు కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు,  ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకురాకూడదు. అలాగే మెహందీ, గోరింటాకు, టాటూలు వేసుకోకూడదని అధికారులు స్ప‌ష్టం చేసారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందు మాత్రమే పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. విద్యార్థి రఫ్‌ వర్క్‌ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు. పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్‌లోనే తిరిగి ఇచ్చివేయా లని అధికారులు సూచించారు. 
పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు. 23న ప్రాథమిక కీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని ఈ నెల 23న విడుద‌ల చేయ‌నున్నారు. అదే విధంగా అగ్రికల్చర్, మెడికల్‌ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 24న ఎంసెట్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు.

Related posts