telugu navyamedia
క్రైమ్ వార్తలు

స్నేహం కోసం ఇద్దరమ్మాయిల సాహసం… మృతదేహాలు కూడా దొరకవు…

Friendship adventure for friendship
తమ స్నేహం కోసం తాము చనిపోతున్నామని లెటర్ రాసిపెట్టి ఇద్దరమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరి ఆచూకీ తెలుసుకుని క్షేమంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే… యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరుకు చెందిన శ్రావణి (17), రంగారెడ్డి జిల్లా ఆమనగల్ కు చెందిన రేష్మా (18) ఇద్దరూ స్నేహితులు. హైదరాబాద్ లోని ఓ కాలేజీలో చదువుతున్న సమయంలో వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి బంధం బలపడింది. ఇంటర్ తరువాత రేష్మాను ఆమె తల్లిదండ్రులు నల్గొండలోని డీఈడీ కాలేజీలో చేర్పించారు. దీంతో ఈ స్నేహితురాళ్ల మధ్య దూరం పెరిగిపోయింది. 
ఆ తరువాత తనకు ఆరోగ్యం బాలేదని, ఆత్మహత్య చేసుకోబోతున్నానని లేఖ రాసిన శ్రావణి ముందుగా ఇంట్లోనుంచి వెళ్లిపోయి రేష్మను కలిసింది. ఇద్దరూ పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ మృతదేహాలు కూడా లభించవని లేఖ రాసి, తమ బ్యాగులు, చెప్పులు, దుస్తులు రిజర్వాయర్ ఒడ్డున విడిచి, సమీపంలోని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి గుంటూరువైపు, తరువాత చెన్నైకి, అటునుంచి ముంబైకి, చివరగా గుజరాత్‌ లోని వడోదరాకు వెళ్లారు. అయితే ఇద్దరమ్మాయిలకూ ఎక్కడా వసతి లభించకపోవడంతో విజయవాడకు తిరిగి వచ్చారు. వీరిద్దరూ తమతో పాటు హాస్టల్ లో ఉన్న ఓ అమ్మాయితో కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ అమ్మాయి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఇద్దరినీ విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Related posts