telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఎముకల బలానికి.. ఇలా.. !!

for strong bones and their health

ఎదిగే పిల్లల నుండి పండు ముదుసలి వరకు అందరికి ఎముకలు దృడంగా ఉండటం ఎంతో అవసరం. అప్పుడే వాళ్ళు వారి దైనందిన జీవితంలో చేసుకోవాల్సిన పనులు తమకు తాముగా చేసుకుంటారు. వివిధ కారణాలతో ఆయా వయసుల వారిలో ఎముకలు బలహీనపడుతుంటాయి. అలాంటి పరిస్థితి వస్తే, చిన్నపాటి దెబ్బ తగిలినా ఎముకలు పెళుసుగా ఉండటంతో విరిగిపోతాయి. చిన్నవారిలో అయితే అవి అతకవచ్చు, కానీ పెద్దవారి లో కష్టం. దానితో వాళ్ళు చివరిదాకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా, ఎముకలకు పోషణ ఇచ్చే ఆహారం రోజు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ క్ర‌మంలోనే చిన్న‌త‌నం నుంచి యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చే వ‌ర‌కు మ‌న శ‌రీరంలోని ప‌లు మిన‌ర‌ల్స్ ఎముక‌ల‌ను దృఢంగా మారేలా చేస్తాయి. అయితే మ‌న‌కు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌స్తే గానీ ఎముక‌ల ద్ర‌వ్య‌రాశి పెర‌గ‌దు. ఆ వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు ఎముకలు దృఢంగా మారాల్సిందే. లేదంటే వృద్ధాప్యంలో ఎముక‌ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఎవ‌రైనా స‌రే.. ఈ కింద సూచించిన పోష‌కాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. ఈ మూడు పోష‌కాలు ఎముక‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డ‌మే కాక‌, ఎముక‌ల ద్ర‌వ్య‌రాశిని పెంచి ఎముక‌ల‌ను దృఢంగా ఉండేలా చేస్తాయి.

1. కాల్షియం
మ‌న శ‌రీరంలోని ఎముక‌ల‌కు కాల్షియం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. కాల్షియం త‌గినంతగా లేక‌పోతే ఎముక‌లు పెళుసుబారిపోతాయి. అలాగే ఎముక‌లు విరిగే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న క‌ణ‌జాలం కూడా ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. పాలు, పెరుగు, ప‌నీర్‌, కోడిగుడ్లు, పాల‌కూర‌, క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ త‌దిత‌రాల్లో కాల్షియం మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తుంది.

2. విట‌మిన్ డి
దీన్ని స‌న్‌షైన్ విట‌మిన్ అని కూడా అంటారు. ఎందుకంటే మ‌నం ఎండ‌లో కొంత సేపు నిలుచుంటే చాలు.. ఈ విట‌మిన్ శ‌రీరంలో దానిక‌దే త‌యార‌వుతుంది. అందుకనే దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. అయితే ఎముక‌ల‌ను దృఢంగా ఉంచేందుకు మ‌న‌కు విట‌మిన్ డి కూడా అవ‌స‌ర‌మే. విట‌మిన్ డి త‌గినంత లేక‌పోతే శ‌రీరం మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లో ఉండే కాల్షియంను శోషించుకోలేదు. క‌నుక విట‌మిన్ డి రోజూ త‌గినంత అందేలా చూసుకోవాలి. అందుకు గాను నిత్యం ఉద‌యాన్నే కొంత సేపు ఎండ‌లో నిలుచోవాలి. దీనితో విట‌మిన్ డి మ‌న‌కు బాగా అందుతుంది. అలాగే కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌, చేప‌లు, పాలు, పుట్ట‌గొడుగుల‌ను త‌ర‌చూ తీసుకున్నా విట‌మిన్ డి మ‌న‌కు ల‌భిస్తుంది.

3. విట‌మిన్ కె
ఎముక‌లు విర‌గ‌కుండా ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ కె ప‌నికొస్తుంది. అలాగే ర‌క్త నాళాలు గ‌ట్టి ప‌డ‌కుండా ఉండేందుకు మ‌న‌కు విట‌మిన్ కె అవ‌స‌రం. విట‌మిన్ కె అధికంగా ఉండే పాల‌కూర‌, బ్రొకొలి, కాలె, కివి, పెరుగు, అవకాడోల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఎముక‌లను దృఢంగా ఉంచుకోవ‌చ్చు.

Related posts