telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఓట్ల లెక్కింపు .. ఇలా.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం, వీవీప్యాట్‌…

vote counting centers in telangana

లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది ఉదయం 4 గంటలకే నిర్దేశిత ప్రదేశానికి చేరుకోవాలి. వారు ఏ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద విధులు నిర్వర్తించాలనేది ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. విధుల కేటాయింపు పూర్తయిన తర్వాత వారు తమకు కేటాయించిన టేబుల్‌ వద్దకు చేరకుంటారు. కౌంటింగ్‌ సిబ్బంది అందరితో ఆ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. కౌంటింగ్‌ సిబ్బందికి వారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు లెక్కిస్తారో 24 గంటల ముందు చెబుతారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌)లో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు లెక్కిస్తారు. వీటి లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని కంట్రోల్‌ యూనిట్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ పరిశీలకులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ సిబ్బంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు; ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తే.. అభ్యర్థి తరఫున టేబుల్‌కు ఒకరు చొప్పున అంతమంది కౌంటింగ్‌ ఏజెంట్లు (ఉదాహరణకు 14 కౌంటింగ్‌ టేబుళ్లు ఉంటే 14 మంది కౌంటింగ్‌ ఏజెంట్లు, రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద ఉండేందుకు ఒక కౌంటింగ్‌ ఏజెంటు); ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌ ఉంటారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయినా కాకున్నా.. ఈవీఎం కంట్రోల్‌ యూనిట్లలో ఉన్న ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభిస్తారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని రౌండ్లు అవసరమో నిర్ణయిస్తారు.ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాలు పడుతుంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 – 15 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్‌కు నియోజకవర్గాల వరుసను బట్టి ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌ను కేటాయిస్తారు. మొత్తం 14 టేబుళ్ల మీద ఉన్న కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండు పూర్తయినట్లు. ఆ తర్వాత 15 నుంచి 29 వరకు క్రమసంఖ్యలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల కంట్రోల్‌ యూనిట్లు లెక్కింపు చేపడతారు. ఇది పూర్తయితే రెండోరౌండ్‌ పూర్తయినట్లు. ఇలా మొత్తం ఎన్ని పోలింగ్‌ కేంద్రాలుంటే.. అన్నీ పూర్తయ్యేవరకు అన్ని రౌండ్లు లెక్కిస్తారు. 
* ఓట్ల లెక్కింపు సందర్భంలో కంట్రోల్‌ యూనిట్ల బ్యాటరీలు పనిచేయకపోయినా, మొరాయించినా..వాటిని తెరిచేందుకు అవకాశం లేకపోయినా…వాటిని పక్కన పెట్టి, వరుసలో తర్వాత ఉండే పోలింగ్‌ కేంద్రాల కంట్రోల్‌ యూనిట్‌ లెక్కింపును చేపడతారు.
* కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక ఈ మొరాయించిన కంట్రోల్‌ యూనిట్లకు సంబంధించిన వీవీప్యాట్‌ చీటీలను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లెక్కిస్తారు. అందులో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు తుదిరౌండు కూడా పూర్తయిన తర్వాతే వీవీప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్ల చీటీలను లెక్కించాలి. ఇలా ఏయే పోలింగ్‌ కేంద్రాల వీవీ ప్యాట్లు ఎంచుకోవాలో లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. ఒకో నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను పోస్టు కార్డు లాంటి కాగితంపై రాసి.. వాటిని నాలుగు మడతలు పెట్టి, ఓ డబ్బాలో వేసి కలుపుతారు. వాటి నుంచి అయిదు కార్డులను లాటరీ తీస్తారు. దాంతో ఏయే వీవీ ప్యాట్‌ చీటీలు లెక్కించాలో నిర్ణయమవుతుంది. మొరాయించిన కంట్రోల్‌ యూనిట్లకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలను మినహాయిస్తారు. అలాగే మాక్‌ పోలింగ్‌ సమయంలో వేసిన నమూనా ఓట్లకు సంబంధించిన చీటీలను వీవీప్యాట్ల నుంచి కొన్నిచోట్ల తొలగించలేదు. అలాంటివాటినీ లాటరీకి పరిగణనలోకి తీసుకోరు.

వీవీప్యాట్‌ చీటీల లెక్కింపునకు ప్రత్యేకంగా మెష్‌తో కూడిన ఒక బూత్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడకు లాటరీలో ఎంపికైన సంఖ్యల ఆధారంగా వీవీ ప్యాట్‌లను తీసుకెళ్తారు. ఆ బూత్‌లోనే అభ్యర్థుల వారీగా వారి గుర్తులతో కూడిన బాక్సులు ఏర్పాటు చేస్తారు. ప్రతి 25 చీటీలను ఒక కట్టగా కడతారు. వాటిలోంచి అభ్యర్థుల వారీగా చీటీలు వేరుచేసి బాక్సులలో వేస్తారు. ఆ తర్వాత బాక్సులోని మొత్తం చీటీలను లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌లోని చీటీల లెక్కింపునకు గరిష్ఠంగా గంట సమయం పట్టే అవకాశముంది. ఒక వీవీ ప్యాట్‌లోని మొత్తం చీటీల లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో దాంట్లోని చీటీలు… అలా ఒకదాని తర్వాత ఒకటిగా లెక్కిస్తారు తప్ప అన్నింటినీ సమాంతరంగా లెక్కించరు. అయిదు వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపునకు సుమారు అయిదు గంటలు పడుతుంది. ఒకవేళ కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపునకు, వీవీ ప్యాట్‌ చీటీలలో వచ్చిన లెక్కకు తేడా వస్తే.. చీటీలను రెండోసారి, అవసరమైతే మూడోసారి కూడా లెక్కిస్తారు. అందుకు అదనపు సమయం పడుతుంది. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీలలోని ఓట్లసంఖ్యనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు. వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సొంతంగా నిర్వహించాలి. పరిశీలకుడు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి.

Related posts