telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాంచి : … ప్రారంభమైన.. తొలివిడత పోలింగ్…

first phase polling started in jharkhand

ఝార్ఖండ్‌లో తొలి విడతలో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు పోలింగ్‌లో మొత్తం 37,83,055మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 189మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కేవలం 15మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామేశ్వర్‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రామచంద్ర చంద్రవంశీ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 3గంటల వరకు సాగనుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. తొలి దశలో కాషాయ పార్టీ 12 చోట్ల పోటీ చేస్తుండగా.. ఒక చోట బరిలో నిలబడకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. భాజపాకు పోటీగా కాంగ్రెస్‌, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్జేడీ మహా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts