telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మొదటిరోజే కాశ్మీర్ అంశంపై .. హోరెత్తిన పార్లమెంట్ .. నేడు అదే కొనసాగనుంది…

parliament india

తొలిరోజే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో కాశ్మీర్‌ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించాయి. జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, శ్రీనగర్‌ ప్రస్తుత ఎంపి ఫరూక్‌ అబ్దుల్లాను సభకు తీసుకురావాలని డిమాండ్‌ చేశాయి. సభ ప్రారంభమైనప్పటి నుండి ముగిసేవరకు విపక్షాలు పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం నుండి నామమాత్రంగాకూడా స్పందన రాలేదు. దీంతో వెల్‌లోకి వెళ్లి కూడా విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ సభ్యుల హక్కులను పరిరక్షించాలని, ఫరూక్‌ అబ్దుల్లాను సభకు తీసుకురావాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే, అధ్యక్షత స్థానంలో ఉన్న స్పీకర్‌ ఓంబిర్లా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించారు. ఆ తరువాత ఇటీవల మరణించిన చిత్తూరు మాజీ ఎంపి ఎన్‌.శివప్రసాద్‌, పశ్చిమ బెంగాల్‌ మాజీ ఎంపి గురుదాస్‌ దాస్‌ గుప్తా, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, రామ్‌ జఠ్మలానిలతోపాటు మరో ఐదుగురు సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది. ఐదు నిమిషాల పాటు సభ్యులంతా మౌనం పాటించారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్లు ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్‌, డిఎంకె, ఎన్‌సిపి, సిపిఎం, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, ఐయుఎంఎల్‌, ఆర్‌ఎస్‌పి, టిఎంసి, ఎస్‌పి, ఆప్‌ తదితర పార్టీల ఎంపిలు లేచి ఫరూక్‌ అబ్దుల్లాను సభకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వెల్‌లోకి దూసుకెళ్లి స్పీకర్‌ పోడియం ఎదుట ఆందోళన చేపట్టారు. ”న్యాయం కావాలి. ఫరూక్‌ అబ్దుల్లాను సభకు తీసుకురండి. దాదాగిరీ వద్దు. రాజ్యాంగాన్ని గౌరవించండి. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు ఆపండి” అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు మహారాష్ట్రలో రైతుల సమస్యలు పరిష్కరించాలని శివసేన ఎంపిలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్రమైన గందరగోళం చోటుచేసుకుంది. దీనిని పట్టించుకోకుండానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు జమ్ముకాశ్మీర్‌లో విధించిన ఆంక్షలకు నిరసనగా కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. మహారాష్ట్ర రైతుల సమస్యలపై శివసేన వాకౌట్‌ చేసింది. అనంతరం కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ అంజన్‌ చౌదరి మాట్లాడుతూ ”ఫరూక్‌ అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని 108 రోజులైంది. ఆయనను పార్లమెంట్‌కు రప్పించాలని కోరుతున్నాం. ఇది ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు” అని పేర్కొన్నారు.. ఫరూక్‌ అబ్దుల్లా నిర్బంధంలో లేరని ఆగస్టులో హోం మంత్రి అమిత్‌ షా సభలో ప్రకటించారు. 108 రోజుల తరువాత కూడా ఆయన సభకు రాలేకపోయారు, కారణం ఏమిటని ప్రశ్నించారు. జమ్ముకాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన మా నాయకుడు రాహుల్‌ గాంధీని అనుమతించలేదు. యూరోపియన్‌ ఎంపిలకు అనుమతిచ్చారు. కాశ్మీర్‌ మన అంతర్గత సమస్య, మోడీ ప్రభుత్వం దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts