telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫిలిం జర్నలిస్ట్‌ .. పర్చా శరత్‌కుమార్‌ కన్నుమూత …

film journalist parcha sarath kumar died

ప్రముఖ జర్నలిస్ట్‌ పర్చా శరత్‌కుమార్‌(74) గారు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 11.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్‌ఎంటి నగర్‌లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. పర్చా శరత్‌కుమార్‌ మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. హెచ్‌ఎంటిలో ఉద్యోగం చేస్తూ హాబీగా సినిమా వార్తలు, సమీక్షలు, సినిమా వారితో ఇంటర్వ్యూలు చేసేవారు. పాతతరం సినీ పెద్దలందరితో చనువుగా మెలిగేవారు. వివిధ సినిమా పత్రికల కోసం ప్రత్యేకంగా సినీ ప్రముఖుల ఇంటర్యూలు చేసేవారు. స్వాతిలో సినిమా వార్తలు రాయడం మొదలుపెట్టారు. పాత తరం సినీ ప్రముఖులకు సంబంధించిన వివరాలు కావాలంటే శరత్‌కుమార్‌గారిని సంప్రదించేవారు.

ముఖ్యంగా టివి9లో ప్రసారమైన ‘అన్వేషణ’ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది తారల వివరాలను ఆయన అందించారు. ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఫిలిం సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గా పనిచేశారు. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు శరత్‌కుమార్‌గారు. గుడిపూడి శ్రీహరి అధ్యక్షులుగా ఉన్నపుడు శరత్‌కుమార్‌గారు ట్రెజరర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ తరలి రావాలి అని ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సెమినార్‌ పెట్టినపుడు అప్పటి అగ్రశ్రేణి తారలందరూ ఆ సెమినార్‌కి వచ్చి తమ అభిప్రాయాలను, సాధక బాధకాలను తెలియజేశారు. అవన్నీ ప్రభుత్వానికి రికమెండ్‌ చేస్తే వాటిలో కొన్నింటిని అమలు చేశారు కూడా. అలా సినిమా పరిశ్రమ హైదరబాద్‌ తరలి రావడంలో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ చేసిన కృషిలో శరత్‌కుమార్‌గారు కూడా ఒక భాగస్వామి అని చెప్పాలి.

Related posts