telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆరోగ్యంగా ఉండాలంటే .. ఉపవాసమూ తప్పనిసరి…

fasting is also a kind of health secret

భారతదేశంలో ఉపవాసం కూడా ఒక సాంప్రదాయమే. అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని పరిశీలిస్తే, అందులోకూడా పెద్దలు ఆరోగ్య పరమైన కారణాన్ని పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనిని మనం అర్ధం అయ్యేట్టుగా తెలుసుకోవాలంటే, చిన్న ఉదాహరణగా, ఏదైనా నలతగా ఉండి వైద్యుడి వద్దకు వెళితే సెలైన్ పెట్టి, ఒకపూట ఏమి తీసుకోవద్దని చెపుతాడు.. అవునా.. అలా ఎందుకు అంటే, దానివెనుక ఆరోగ్య రహస్యం ఉంది కాబట్టి. దానినే ప్రస్తుత వైజ్ఞానికులు పరిశోధనలతో కనుగొన్నారు.. వారి నివేదిక ప్రకారం ఉపవాసం ఉండటం వలన కూడా ఆరోగ్యం చేకూరుతుంది అని తేలింది. దీనిని బట్టి, పెద్దల మాట చద్దిమూట అనేది మరోసారి రుజువైంది కదూ. మ‌న దేశంలో అనేక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ ఆచారాలు, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా దైవం కోసం ఉప‌వాసం చేస్తుంటారు. దాంతో పుణ్యం వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తారు. అయితే పుణ్యం మాట అటుంచితే ఉప‌వాసం వ‌ల్ల మ‌న‌కు సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంద‌ని సైంటిస్టులు కూడా స్పష్టం చేశారు.

ఈ పరిశోధనలు, యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ (యూసీఐ) ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే ఎలుక‌ల‌పై చేశారు. 24 గంట‌ల పాటు కొన్ని ఎలుకల‌కు ఎలాంటి ఆహారం ఇవ్వ‌కుండా ఉప‌వాసం ఉంచారు. అనంత‌రం వాటికి ఆహారం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారి ప‌రిశోధ‌న‌లో తేలిందేమిటంటే… ఉప‌వాసం ఉన్న ఎలుక‌ల్లో ఆక్సిజ‌న్ తీసుకోవ‌డం, శ్వాస ప్ర‌క్రియ‌, శ‌క్తి ఖ‌ర్చ‌వ‌డం వంటి క్రియలు క్ర‌మ‌బ‌ద్దీక‌రింప‌బ‌డ్డాయ‌ని నిర్దారించారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి సైంటిస్టులు చెబుతున్న విష‌యం ఏమిటంటే.. మ‌నుషులు కూడా ఉప‌వాసం చేస్తే మెట‌బాలిజం స‌రిగ్గా ఉంటుంద‌ని, త‌ద్వారా సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంద‌ని, ముఖ్యంగా వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఉప‌వాసం ద్వారా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు..!

* ఉపవాసం అంటే దైవాన్ని తలుచుకుంటూ, ఆయనకు దగ్గరగా ఉండటం; ఆహారం మానేసి, పడుకోవడం కాదు. ఉపవాసంలో దైవచింతన, నామస్మరణ, ఇత్యాది కార్యక్రమాలు చేపట్టాలి. ఉండలేను అని ఎప్పుడు అనిపించినా, పాలు లేదా, నిమ్మరసం వంటివి తగిన మోతాదులో తీసుకోవాలి. ఉపవాసం అంటే, శరీరాన్ని కాపాడుకుంటూ, దైవంపై మనసు నిలపడం.

Related posts