telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే..

*సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన బాలినేని శ్రీనివాస్ భేటి..
*వైఎస్ కుటుంబానికి మేం విధేయులం..
*నా రాజీనామాపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింది..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ ముగిసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రి పదవి కోసం ఏనాడూ కూడా పాకులాడలేదన్నారు.

వైఎస్‌ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడినేనని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే మంత్రి పదవిని వదిలేసుకొని వచ్చానని ఆయన గుర్తు చేసుకొన్నారు. మంత్రి పదవుల కేటాయింపు అనేది సీఎం ఇష్టమన్నారు.

తాను రాజీనామా చేస్తున్నాననే వార్తలను ఖండించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని, సీఎం జగన్‌ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు.

సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్‌ కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. గతంలో సురేష్ తాను కూడా మంత్రివర్గంలో ఉన్నామన్నారు. సురేష్ ఏనాడూ కూడా జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు.తన శాఖ మినహా ఇతర వ్యవహరాలను సురేష్ పట్టించుకోలేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అని బాలినేని ప్రశంసించారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని అన్నారు. మంత్రిపదవి రాలేదని అసంతృప్తి చెందే వారంతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు .పార్టీ ఒక కుటుంబం.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Related posts