telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ప్రతి టెండర్ జ్యుడిషియల్ పర్యవేక్షణలో జరుగుతుంది : సీఎం జగన్

jagan attending guntur iftar tomorrow

రాష్ట్రంలో ప్రతి టెండర్ కూడా జ్యుడిషియల్ కమిషన్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని ఏపీ సీఎం జగన్ వివరించారు. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ గురించి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడినట్టు ఎమ్మెల్యేలతో చెప్పారు. ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అవినీతికి ఏమాత్రం తావివ్వని రీతిలో పాలన ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం తమవైపే చూస్తున్న ఈ తరుణంలో ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. తాము వేసే ప్రతి అడుగు తమ గ్రాఫ్ పెంచే విధంగా ఉండాలన్నారు. ప్రతి చర్య ప్రజలకు దగ్గరయ్యేలా ఉండాలంటూ కర్తవ్యబోధ చేశారు. 

ప్రజాసంక్షేమం కోసం పాలనలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సి ఉందని అన్నారు. ప్రతి కాంట్రాక్టు మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుందని, ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్ లో టెండర్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా టెండర్లో మార్పులు అవసరమని జ్యుడిషియల్ కమిషన్ సూచిస్తే, తక్షణమే మార్పులు చేస్తామని అన్నారు. ఆరోపణలు వచ్చిన టెండర్లలో రివర్స్ టెండర్ ప్రక్రియ అమలు చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు అంచనాలకు మించి దోచుకున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తమ హయాంలో అలాంటి పాలన ఉండదని తేల్చిచెప్పారు.  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు.

Related posts