telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. గెలిచింది ఆతిధ్య జట్టు.. అయినా రెండు టీం లకు సెమీస్ లో స్థానం..

england won on newzeland got place in semi finals

ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరులో ఆతిధ్య జట్టు తీవ్రంగా పోరాడి మొత్తానికి సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. చెస్టర్‌లీ స్ట్రీట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక పోరులో అన్ని విభాగాల్లోనూ రాణించిన ఆతిథ్య జట్టు 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, కివీస్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు ఆశలు నీరుగారి 305 పరుగులకు సరిపెట్టుకుంది. బెయిర్‌స్టో (106) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ జాసన్ రాయ్ (60) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మోర్గాన్ 42 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్‌, నీషమ్‌, హెన్రీలు విజృంభించి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.

306 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 186 పరుగులకే కుప్పకూలి 119 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. కివీస్ బ్యాట్స్‌మెన్‌లో టామ్ లాథం చేసిన 57 పరుగులే అత్యధికం. కెప్టెన్ విలియమ్సన్ 27, రాస్ టేలర్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. సెంచరీ హీరో జానీ బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగా, ఓడినా న్యూజిలాండ్‌కు ఆశలు సజీవంగా ఉన్నాయి. 11 పాయింట్లతో కివీస్ నాలుగో స్థానంలో ఉండగా, 9 పాయింట్లతో ఉన్న పాక్ రేపు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో పాక్ గెలిచినా నెట్ రన్‌రేట్ ఆధారంగా కివీస్ సెమీస్‌కు చేరుతుంది. పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే బంగ్లాదేశ్‌పై 316 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాదు కాబట్టి సెమీస్‌లో న్యూజిలాండ్ చోటు దాదాపు ఖాయమైనట్టే.

Related posts