telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. పిచుక మీద బ్రహ్మాస్త్రం .. ఆతిధ్య జట్టు భారీ విజయం..

england won on afghanistan in world cup match

ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన ఆఫ్గనిస్థాన్‌-ఇంగ్లండ్ మ్యాచ్ లో ఆతిధ్య జట్టు 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 247 పరుగులు మాత్రమే చేసింది. అయినప్పటికీ ఆ జట్టు చూపిన పోరాట స్ఫూర్తి కొనియాడదగినది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేయగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మోర్గాన్ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. అలాగే జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 90 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (82 బంతుల్లో 88 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆఫ్గన్ బౌలర్లలో దావ్లత్ జద్రాన్, గుల్బదీన్ నయీబ్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి.

భారీ లక్ష్యంతో ప్రారంభంలో ఆఫ్గనిస్థాన్ నిలకడగా ఆడింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో హష్మతుల్లా షాహిది (100 బంతుల్లో 76 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. అలాగే రహ్మత్ షా (74 బంతుల్లో 46 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్), అస్గర్ అఫ్గన్ (48 బంతుల్లో 44 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు కొంత సేపు క్రీజులో నిలదొక్కుకున్నా.. ఎప్పటికప్పుడు సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. అలాగే ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ బౌండరీలను బాదడంపై దృష్టి పెట్టలేదు. 50 ఓవర్ల గేమ్ ఆడాలనే ఉద్దేశంతో ఇన్నింగ్స్ కొనసాగించారు. దీంతో చేయాల్సిన పరుగులు పెరిగిపోయి చివరికి ఆఫ్గనిస్థాన్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు.

Related posts