telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రీ పెయిడ్‌ కరెంటు వచ్చేసింది… త్వరలో ప్రీ పెయిడ్‌ మీటర్ల విధానం…!

Meter

ఈ నెలలో మీరు ఊళ్లో ఉండరా? కరెంటు బిల్లు రూ.200 మించి అవదని భావిస్తున్నారా!? అయితే, మీరు రూ.200 కరెంటునే కొనుక్కోవచ్చు! ప్రీ పెయిడ్‌ ఫోన్‌ బిల్లు తరహాలో ఇప్పుడు ప్రీ పెయిడ్‌ కరెంటు వచ్చింది! మీరు ఎంతసేపు ఫోన్‌ మాట్లాడతారో దానినిబట్టి.. ప్రీపెయిడ్‌ చార్జ్‌ చేయించుకుంటారు కదా! ఇప్పుడు అలాగే, ముందుగా డబ్బులు చెల్లించి మీకు కావాల్సినంత కరెంటునే కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకే ప్రీ పెయిడ్‌ మీటర్ల విధానం అమల్లో ఉండగా.. తాజాగా ఇళ్లకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని డిస్కమ్‌లు నిర్ణయించాయు. వీటిని పెట్టుకునేందుకు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారికి విద్యుత్తు చార్జీల్లో యూనిట్‌కు రూ.0.10 దాకా రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో ఈ ప్రతిపాదనను చేర్చాయి. ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌కు రూ.8 వేలు అవుతుండగా.. త్రీ ఫేజ్‌ మీటర్‌కు రూ.12 వేలు అవుతుంది. కాగా, ఏఆర్‌ఆర్‌ నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిన డిస్కమ్‌లు.. నెలాఖరులోగా దానిని దాఖలు చేయాలని నిర్ణయించాయి. ఈనెల రెండో వారంలో ట్రాన్స్‌కో సీఎండీ దే వులపల్లి ప్రభాకర్‌ రావు విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఆయనతో చర్చించి.. విధాన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఏటా రూ.11 వేల కోట్ల దాకా ఆదాయ లోటు ఉంటుందని అంచనాలున్నాయి. వాస్తవానికి 2019-20 సంవత్సరానికిగాను ఏఆర్‌ఆర్‌ దాఖలు చేయలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చార్జీలనే ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సబ్సిడీలు ఇవ్వకపోతే చార్జీల హేతుబద్ధీకరణకు నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. డిస్కమ్‌ల పరిస్థితి కనాకష్టంగా ఉండటం, విద్యుత్తు కొనుగోళ్లు జరుపుతున్నా చార్జీలు చెల్లించలేని స్థితిలో ఉండటమే ఇందుకు కారణం.

Related posts