ee prasnaku baduledi poetry corner

ఈ ప్రశ్నకు బదులేది?

“ఆద్యంతం నివురు గప్పిన నిప్పుల మధ్య ముడుచుకు కూర్చున్న “మానవత్వం”
చైతన్య స్థితికి రాజుకొనేలోగా కాలిపోతున్న  కట్టెలుఎన్నో….
శిరస్సు నుండి పాదాల వరకూ వ్యాపించిన ధమని సిరల్లో ” నైతికత్వం”
ప్రవాహ ఉధృతిని చేరిలోగా చిట్లిపోతున్న “బతుకు నాళాలెన్నో”….

న్యాయాన్యాయల మధ్య తిరిగే “నీతి సూర్యుడు”
వెలుగు పంచేలోగా చీకటి అవుతున్న “సజీవ గగనాలెన్నో”….
హరిత సంపద వేర్ల నుండి చిగుళ్లకు చేరేలోగా
దారువు దారుల్లో దోపిడీకి గురవుతున్న “దేహ ఆహారాలెన్నో”….

స్త్రీనాభి నాళం నుండి తెంచబడిన మాంసఖండం
“మనిషి” గా మారేలోగా
నెత్తుటి ముద్దలుగా మారుతున్న “అతివ బతుకులెన్నో'”…

కొవ్వొత్తుల ధర పెరిగింది….
కన్నీటి ధార పొంగి పొరలుతుంది…
కొవ్వెక్కిన ఈ మృగత్వాన్ని కరిగించడానికి ఇంకెన్ని నెత్తుటి సెలయేళ్ళు కావాలి..???.”

 

-డి.నాగజ్యోతిశేఖర్,
        మురమళ్ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *