telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

దసరా పండుగ : అమ్మవారి ప్రత్యేకతలు

దసరా పండుగ అన్నిటికీ మించి అమ్మ పండుగ. కొలువు తీరే కనక దుర్గమ్మ వేల సంవత్సరాల అమ్మదేవతకు ప్రతీక. నవరాత్రి పందిళ్లలో చాలా చోట్ల అమ్మవారి విగ్రహాలు కాళిదాసు చెప్పిన మాణిక్య వీణ ధరించి ఉండటం చూస్తే మతాలు, మాతల పరిణామ క్రమమంతా కళ్లముందు కదలాడినట్టయింది. భూగోళంపై ఎక్కడ ఏ మానవ సమూహాన్ని తీసుకున్నా అన్నిటికీ ఆది బిందువు అమ్మ భావన. మరో ప్రాణికి జన్మనివ్వడం ఆడవాళ్ల ద్వారానే అవుతుంది గనుక వారినే పూజించారు. మొలిచే మొక్కలూ, పండే పంటలూ అన్నిటిలోనూ స్త్రీ రూపాన్ని చూశారు. ప్రకృతిని అమ్మగా కొలిచారు. తొలుత పూజనందుకున్నవి అమ్మ జననాంగాలు (తర్వాతే లింగపూజ). ప్రసవం రక్తంతో ముడిపడి ఉంది. అందుకు ముందూ రక్తస్రావం అమ్మలో కనిపిస్తుంది. రక్తానికి సంకేతమైన ఎరుపు పవిత్రత పొందింది. రాతి యుగపు దేవతలందరూ స్త్రీలే. హరప్పా శిథిలాలలో అమ్మదేవతలకు సంబంధించిన ప్రతిమలు, ప్రతీకలు ఎన్నో, నేలమ్మ, చెట్టమ్మ, గంగమ్మ, ఎల్లలు కాచే ఎల్లమ్మ, పొలిమేరమ్మ, బతుకునిచ్చే బతకమ్మ, కోపమొస్తే వ్యాధులు తెచ్చే ఆటలమ్మ, పెద్దమ్మ ఇలా అన్నిలోనూ అమ్మ విశ్వరూపమే.
ఇదంతా ఆర్యుల రాకకు ముందు సంగతి. వారు ఇక్కడకు వచ్చేటప్పటికి పశుపోషకులుగా, వేటగాళ్లుగా, ఆహార సేకరణ చేసే సంచారకులుగా ఉన్నారు. యుద్ధ ప్రియులు, వ్యవసాయం గురించి తెలియదు. వేట కారణంగా మహిళలు ఇంటి వద్దనే ఉండిపోవాలి. మాతృస్వామికం స్థానే పురుషుల ఆధిక్యత కల్పించే పితృస్వామికం, అంతకుముందున్న అమ్మదేవత వెనక్కుపోయింది. రుగ్వేదంలో అదితి, ఉష అనే మహిళలు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తారని, వారిని కూడా ప్రత్యేకంగా పూజించే శ్లోకాలేమీ లేవని పరిశోధకులు తేల్చారు.
ఆర్యులు విస్తరిస్తున్న కొద్ది అనార్య తెగలను తమతో కలుపుకోక తప్పలేదు. ఉభయుల విశ్వాసాలూ సర్దుబాటు అయ్యాయి. బౌద్ధ జైనాలను ఎదుర్కోవడానికి భక్తి సంప్రదాయం పెరిగింది. దేవతల ప్రాధాన్యతలు మారాయి. అంతకుముందు అందరి కన్నా గొప్ప దేవుడైన ఇంద్రుడు వెనక్కుపోయి, ఉపేంద్రుడైన విష్ణువు కేంద్ర స్థానంలోకి వచ్చాడు. అమ్మ దేవతలకూ స్థానం లభించింది. అయితే దేవుళ్ల భార్యలుగా మాత్రమే లక్ష్మి, పార్వతి, సరస్వతి తదితరులు వెలిశారు. అంతకుముందు అమ్మదేవతలు బలంగా, భయంకరంగా ఉంటే ఇప్పుడు సుకుమారంగా మారిపోయారు. దేవీ నవరాత్రులు సందర్భంలో దుర్గను ఆదిశక్తి అని అభివర్ణిస్తారు. సృష్టి, స్థితి లయకారకులున్నప్పుడు ఇలా ఆమెకు ఆదిస్థానం ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. ఇంతా చేసి ఆమె శివుడు భార్య అంటారు. అన్నట్టు శివుడు కూడా అక్షరాలా అనార్య దేవుడు. తర్వాతే ఆయన గురించిన కథలు మారాయి.
ఇలాంటి ఎన్ని మార్పులొచ్చినా సరే, పురుష దేవతా ప్రపంచంలో ఏకైక మహిళా ప్రతినిధిగా నిలబడిన శక్తి స్వరూపిణి దుర్గ. మెడలో పుర్రెలతో సింహారూఢయై, రక్తపు నాలుక బయటకు సాచిన దుర్గ మహిషాన్ని వధించే చిత్రాలు నాల్గవ శతాబ్ది నుంచి దర్శనమివ్వడం ప్రారంభమైంది. ఆరవ శతాబ్దినాటికి దుర్గ ప్రసిద్ధ దేవతగా ఆవిర్భవించింది. మధ్యయుగాలకు వచ్చేసరికి దుర్గ విష్ణువును పోలిన లక్షణాలతో పూజలందుకో సాగింది. మధుకైటభులనే రాక్షసులను సంహరించేందుకు ఆమె విష్ణువు నుంచే అవతరించిందని విష్ణు పురాణ కథ. స్కంద పురాణం ప్రకారమైతే దుర్గ అనే రాక్షసి ప్రపంచాన్ని పీడిస్తుంటే శివుడి ఆదేశంపై పార్వతి ఆ రాక్షసిని సంహరిస్తుంది. అప్పటి నుంచి ఆమెకు ఆ పేరే స్థిరపడుతుంది. శంభు విశుంభులనే రాక్షసుల సంహార గాథలోనూ ఇదే విషయం. ఇలా రకరకాల కథలున్నాయి. వీటన్నిటిలోనూ దుర్గ తనుగానే పోరాడుతుంది. ఇక అత్యధికంగా చెప్పుకునే మహిషాసుర మర్థిని కథ. మహిషుడు స్త్రీ చేతుల్లో తప్ప చనిపోకుండా వరం పొందుతాడు. (స్త్రీ ఎలాగూ చంపలేదని అసహనంలోంచి పుట్టుకొచ్చిన వాడే అపరిచితుడు. ఇక్కడ ఇంకోటి మతతత్వం, పునరుద్ధరణ తత్వం పెరిగిన నేపథ్యంలో ఈ నడిమి తరగతి మానవుడు నేటి సమస్యలకు పరిష్కారం కోసం వెనక్కు చూసే లక్షణం కూడా పెంచుకున్నాడు. ప్రాచీన గ్రంథాలు, విశ్వాసాలు గొప్పవనే నమ్మకమూ రుద్దబడుతోంది. పురాణాలలో చెప్పిన ప్రాచీన శిక్షలు అమలు చేయాలన్న భావన తత్ఫలితంగా వచ్చిందే. వాడి ఉద్దేశం). ఎందరో దేవతల శక్తి స్త్రీ రూపం తీసుకుని ప్రపంచమంతా వ్యాపిస్తుంది. శివుడి నుంచి మొహం, యముడి నుంచి శిరోజాలు, విష్ణువు నుంచి చేతులు ఇలా వచ్చి చేరతాయి. వారి ఆయుధాలు కూడా వస్తాయి. అంటే దేవతగా చూపుతూనే ఆ శక్తి పురుష దేవుళ్ల నుంచి వచ్చిందని చెప్పడం. దేవీ భాగవతంలో ఆమెకూ మహిషాసురుడికీ మధ్య సుదీర్ఘ వాదన కూడా నడుస్తుంది. స్త్రీ అబల అని, ఆమె ప్రేమకు తప్ప ఇంకెందుకూ పనికిరాదని తూలనాడిన మహిషుడు ఆమె చేతిలో హతుడవుతాడు. పార్వతి సృష్టించిన వినాయకుడిని ఈశ్వరుడు చంపి బతికించడం ప్రసిద్ధమైన కథ. ప్రాచీన కాలంలోని ఒక చిత్రంలో దుర్గ సంహరించిన మహిషుడు ఈశ్వరాకారంలో ఉంటాడు. తర్వాత అందులోనుంచి ఒక అందమైన యువకుడు వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుాండు. మహారాష్ట్రలోనైతే మహిషుడ్ని మొది రోజు సంహరించి మరుసి రోజు పెళ్లి చేసుకున్నట్టు భావిస్తారు.
రామాయణంలో సీత భూమిలో నుంచి జనించడంలోనూ అమ్మ దేవత లక్షణాలున్నాయి. భారతంలో పాండవుల జననంలో, కర్ణుని పుట్టుకలోనూ కూడా మాతృస్వామిక లక్షణాలను మనం చూడొచ్చు. నీటిలో, కుండలో పుట్టారని చెప్పే సందర్భాలన్నీ అమ్మ దేవతలకు ప్రతీకలని కోశాంబీ వివరిస్తారు. దేవీ నవరాత్రుల తర్వాత పదోరోజు నుంచీ ఆలయాన్ని మూసేసే పద్దతి చాలా చోట్ల ఉంది. అమ్మ మళ్లీ శక్తి పుంజుకుని మానవ సృష్టికి ఉపక్రమించాలనే భావనే ఇందుకు మూలం.
పురాణాలు ప్రవచనాలలో కనిపించని ఎంతో మంది దేవతలు కింది కులాల వారి పూజలందుతూనే ఉన్నారు. వారిని క్షుద్రదేవతలని పండితులు ఈసడిస్తుంటారు. ఈ దేవతల పూజారులు గణాచార్లు కూడా స్త్రీలు లేదా వెనకబడిన వారే ఉంటారు. మూఢత్వాన్ని గుర్తిస్తూనే మానవాభివృద్ధి క్రమంలో మాతృమూర్తి ప్రతిరూపాలుగా వారిని గుర్తించవలసి ఉంటుంది. అలంపురంలోని జోగులాంబ శక్తిపీఠం, విజయవాడ కనకదుర్గమ్మతో సహా అమ్మదేవతల ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దసరాకు సమాంతరంగా బతకమ్మ పండుగ కూడా జరుగుతుంది. సమాజ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి పనికివచ్చే సంగతులే ఇవన్నీ. అమ్మ అన్నది కేవల సిమెంటు కాదు. అమ్మ ప్రకృతిలో, సమాజంలో తొలి సత్యం. అమ్మను బొమ్మగా మార్చే సంస్కృతిని ఛేదించి ఉన్నత స్థానంలో పునఃప్రతిష్టించడమే జరగాల్సిన పని.

Related posts