telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో ప్రయాణికుడిని టేప్ తో సీటుకు కట్టేసిన సిబ్బంది… ఎందుకంటే ?

రష్యన్ విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తి మినరెల్నీ వోడీ నుంచి నోవోసిబిరిస్క్‌ వెళ్లేందుకు మంగళవారం ఎస్‌7 ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ఎక్కాడు. పూటుగా మద్యం సేవించిన అతగాడు కాసేపటి తర్వాత కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. దాంతో విమానసిబ్బంది అతడిని వారించే ప్రయత్నంగా చేయగా వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత కెప్టెన్‌తో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అతడి ప్రవర్తనతో భయబ్రాంతులకు గురైన తోటి ప్రయాణికులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ అవేమి పట్టించుకోకుండా తోటి ప్రయాణికులతో కూడా వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి యత్నించాడు. దీంతో చేసేదేమిలేక అతను కూర్చున సీటుకే తాడుతో కట్టేశారు. అయితే సీటుకు కట్టేసిన అతగాడు శాంతించలేదు. పైగా మరింతగా రెచ్చిపోయాడు. తిట్ల పురాణం ఎత్తుకున్నాడు. విమానంలోని ప్రయాణికులను అసభ్య పదజాలంతో నోటికి వచ్చింది తిట్టడం మొదలెట్టాడు. దాంతో విమానం నవోసిబిర్క్స్‌లో ల్యాండ్‌ కాగానే విమాన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడు పోలీసులను కూడా దూషించడంతో పాటు దాడికి దిగాడు. దాంతో సదరు వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్తా బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో అది వైరల్‌గా మారింది.


Video Source : Flyer

Related posts