telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కల్కి భగవాన్ ఆశ్రమంలో డ్రగ్స్ కార్యకలాపాలు .. వేలకోట్ల భూ దందా..

drugs mafia in kalki bhagavan asram

కల్కి భగవాన్ ఆశ్రమంలో డ్రగ్స్ కార్యకలాపాలు చోటు చేసుకున్నాయనే వార్తలు ఐటీ దాడులతో వెలుగులోకి వచ్చాయి. లేహ్యం రూపంలో డ్రగ్స్ ను సరఫరా చేసే వారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ.. వదంతులు మాత్రం ఆగట్లేదు. డ్రగ్స్ ను సరఫరా చేయడం వల్లే వందల కోట్ల రూపాయలను ఆర్జించారనే చెబుతున్నారు స్థానికులు. కల్కి భగవాన్ ఆశ్రమం అనేక రహస్యాలకు కేంద్రబిందువుగా మారిందని అంటున్నారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ, వరదయ్య పాలెం ఆశ్రమం ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీని అదుపులోకి తీసుకున్నారు. కల్కి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారులు సంధించే పలు ప్రశ్నలకు వారు సమాధానాలను ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని తెలుస్తోంది. సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లో చాలా వాటిపై కల్కి భగవాన్, ఆయన భార్య, కుమారుడు కృష్ణాజీ, ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీల సంతకాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నలుగురు కాకుండా మరి కొందరి సంతకాలు ఉండటంతో వారు బినామీలు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఆశ్రమానికి ఆఫ్రికాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గల్ఫ్ లోని ఖతర్ లోనూ భూములను కొనుగోలు చేసినట్లు తేలిందని అంటున్నారు. రెండురోజులుగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ.. సంబంధిత అధికారుల వద్ద నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోదాలను ముగించిన తరువాతే స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కల్కి భగవాన్ ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియ రావాల్సి ఉంది. కల్కి ఆశ్రమంలో కోట్ల రూపాయలు లెక్కకు మించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తుండటం అధికారుల్లో సైతం విస్మయం వ్యక్తమౌతోందని అంటున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారనడానికి అవసరమైన డాక్యుమెంట్లను సాక్ష్యాధారాలను వారు సేకరించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని ఇప్పటికే వెల్లడైంది. తమిళనాడు సరిహద్దులకు ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు సమీపంలో భారీ ఎత్తున భూములు ఉన్నట్లు నిర్ధారించారు.

ఐటీ సోదాల సందర్భంగా ఆశ్రమ సిబ్బంది సెల్‌ ఫోన్లపై అధికారులు నిఘా ఉంచారు. కోడ్ సంకేతాలతో కొన్ని సందేశాలు వెళ్లినట్లు గుర్తించారు. వాటి గురించి ఆరా తీస్తున్నారు. కోడ్ ల సంకేతాలు ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ సంకేతాలు ఎవరికి వెళ్లాయనే విషయం గురించి కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పూర్ణిమ అనే ఓ మహిళా ఉద్యోగిని నుంచి ఈ కోడ్ సంకేతాలు వెళ్లినట్లు తేలింది. విదేశీ కరెన్సీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించినవిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడి అనంతరం కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల మేర స్థిరాస్తులను కొనుగోలు చేసిన కల్కి భగవాన్ ఆశ్రమం నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారాలను కూడా చేపట్టారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ ఎక్కడిదనే కూపీ లాగగా.. డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించిన గుట్టు బయట పడిందని తెలుస్తోంది.

Related posts