telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

టిక్ టాక్ డెడ్ లైన్ పై ట్రంప్ సంతకం!

trump usa

చైనాకు చెందిన వీడియో యాప్ టిక్ టాక్ పై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌తో లావాదేవీల‌ను నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. బైట్ డ్యాన్స్ తో ఏవైనా సంప్రదింపులు జరపాలని భావిస్తే, 45 రోజుల్లోగా పూర్తి చేసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.

చైనా ప్ర‌భుత్వ ఆధీనంలో లేమ‌ని, ఆ దేశానికి ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని టిక్‌టాక్ పేర్కొన్న‌ది. టిక్‌టాక్ త‌ర‌హాలోనే ట్రంప్ వీచాట్‌ను కూడా నిషేధించాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో ఇన్ఫ‌ర్మేషన్‌, క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ అంశంలో అద‌‌న‌పు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. చైనాలో అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేష‌న్ల వ‌ల్ల అమెరికా జాతీయ భ‌ద్ర‌త‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం ఏర్పడిన‌ట్లు ట్రంప్ తెలిపారు.

చైనాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇంతవరకూ సుంకాలను పెంచుతూ వచ్చిన అమెరికా, ఇటీవలే టిక్ టాక్ యాప్ ను యూఎస్ లో నిషేధిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆపై మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ యూఎస్ యూనిట్ ను సొంతం చేసుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు వార్తలు వెలువడ్డాయి.

Related posts