telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

బతికుండగానే చనిపోయినట్టు నిర్దారించిన వైద్యులు

Parents Murdered Daughter at Mancherial
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడికి చికిత్స అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బతికుండగానే అతడు చనిపోయినట్టు నిర్దారించారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ‘నీ కొడుకు చనిపోయిండు… పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిరా…అప్పుడు పోస్టుమార్టం కు పంపిస్తాం’ అంటూ తండ్రికి సలహా ఇచ్చారు. సుమారు 16 గంటల పాటు నిర్జీవంగా ఉన్న యువకుడిని పరీక్షించిన మరో వైద్యుడు బతికే ఉన్నాడని గుర్తించి చికిత్స అందించాడు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరుకు  చెందిన భాను తన స్నేహితునితో కలిసి ఈ నెల 28వ తేదీ రాత్రి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో భానుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే దగ్గరలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు చనిపోయాడని తేల్చి చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత పోస్టుమార్టం చేస్తామని వైద్యులు తండ్రికి సూచించారు. 
మరుసటి రోజు వచ్చిన డ్యూటీ డాక్టర్‌ భానును పరిశీలించి బతికే ఉన్నాడని చికిత్స చేశారు. తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఫిర్యాదు చేసి, పోలీసులను తీసుకొచ్చిన తండ్రి ఆస్పత్రికి రాగానే విస్తుపోయే నిజం తెలుసుకున్నాడు. ‘నీ కొడుకు బతికే ఉన్నాడు’ అని వైద్యులు చెప్పారు. సుమారు 16 గంటల పాటు ఎలాంటి వైద్యమూ చేయకుండా ఉన్న వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్‌ చేసింది.

Related posts