telugu navyamedia
రాజకీయ వార్తలు

రాధాపురం లో … డీఎంకే అభ్యర్థి అప్పావు దే విజయం .. : స్టాలిన్

stalin going to attend to jagan oath program

రాధాపురం శాసనసభ నియోజకవర్గం ఓట్ల రీకౌంటింగ్‌లో డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం తథ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో పుదుకోట జిల్లాకు చెందిన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం సీనియర్‌ నేత భరణికార్తికేయన్‌ నాయకత్వంలోని పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు స్టాలిన్‌ సమక్షంలో డీఎంకే సభ్యత్వం స్వీకరించారు. ఆ సందర్భంగా ఏర్పాటైన సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు పదిహేను నియోజకవర్గాలలో డీఎంకే గెలుపును పాలకులు, ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకుని అక్రమాలకు పాల్పడి అధికార అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను గెలిచినట్టు ప్రకటించారని ఆరోపించారు. దిండివనంలో డీఎంకే కూటమి అభ్యర్థి గెలుపును స్థానిక ఎన్నికల అధికారులు అడ్డుకుంటున్నారని తెలియగానే తాను హుటాహుటిన అక్కడికి వెళ్ళి అధికారులతో వాదించిన మీదట అక్రమాలకు పుల్‌స్టాప్‌ పడిందని, డీఎంకే కూటమి అభ్యర్థి గెలిచారని, అయితే రాధాపురం నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై గెలిచినట్టు ప్రకటించారన్నారు.

పోలీసులే డీఎంకే అభ్యర్థి అప్పావును కౌంటింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు గెంటివేశారని, తపాలా ఓట్లు లెక్కించలేదని, చివరి మూడు రౌండ్లలోను డీఎంకేకి పడిన ఓట్లను అన్నాడీఎంకేకు పడినట్టు లెక్కగట్టి అక్రమాలకు పాల్పడ్డారని, ఈ వివరాలన్నీ ప్రసార మాధ్యమాల్లో బట్టబయలైందన్నారు. రాధాపురంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై గెలుపును రద్దు చేయాలని డీఎంకే అభ్యర్థి అప్పావు రెండున్నర సంవత్సరాలుగా సుదీర్ఘ న్యాయపోరాటం జరిపారని స్టాలిన్‌ తెలిపారు. అప్పావు న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించిందని, హైకోర్టు ఆదేశం ప్రకారం రీకౌంటింగ్‌ జరిగిందని, ఫలితం ఇన్బదురైకి ప్రతికూలంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించడం వల్ల ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదని, వారం రోజులు ఓపికపడితే అప్పావుకు శుభవార్త అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో అధికార పార్టీ హడావుడి అధికంగా వుందని, ఆ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదని, చివరి క్షణం దాకా సస్పెన్స్‌ కొనసాగిస్తారన్నారు. స్థానిక ఎన్నికల కంటే ముందుగా విక్రవాండి, నాంగునేరి శాసనసభ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లోనూ డీఎంకే కూటమి అభ్యర్థులు గెలవడటం ఖాయమని చెప్పారు. మొత్తానికి రాధాపురం ఫలితంతో కలుపుకుంటే డీఎంకే కూటమి మూడుచోట్ల విజయం సాధిస్తుందన్నారు.

Related posts