telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డీకే శివకుమార్ .. అరెస్ట్ …

dk sivakumar arrested by police

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. శివకుమార్‌ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డికె శివకుమార్‌ మరికొందరిపై గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులో శివకుమార్‌తోపాటు, ఢిల్లీలోని కర్నాటక భవన్‌కు చెందిన ఉద్యోగి సహా మరికొందరి పేర్లను ఈడీ చేర్చింది. గత కొన్నిరోజులుగా శివకుమార్‌ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి విచారణ కొనసాగించిన అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

ఈడీ అధికారుల విచారణ నిమిత్తం ఢిల్లీలో ఉన్న డీకేను కర్ణాటకకు చెందిన నేతలు పరామర్శించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తనకు ఆరో తేదీ వరకు సెలవు ఇవ్వాలని శివకుమార్‌ చేసిన విన్నపాలను అధికారులు తోసిపుచ్చారు. హైకోర్టు శివకుమార్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ సమన్లపై డికె తొలుత ఘాటుగా స్పందించారు. దీని గురించి తనకు ఎలాంటి ఆందోళనా లేదన్నారు. తాను ఎలాంటి పొరపాటూ చేయలేదని చెప్పారు. తాను ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, లైంగిక దాడికి పాల్పడలేదని, తనకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనను వేధిస్తున్నారని విమర్శించారు.

Related posts